వైరస్‌ వ్యాధులతో జాగ్రత్త! ఏపీ, తెలంగాణాల్లో ప్రాణాంతక హెపటైటిస్‌.. నివారణ మార్గాలు తెలుసుకోండి

17 Jan, 2022 05:27 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న హెపటైటిస్‌ కారక వ్యాధులు

జాతీయస్థాయి సగటు 0.9% బాధితులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 2.3% ఉన్నట్లు ఎన్‌సీడీసీ వెల్లడి

నియంత్రణకు ఏపీ సర్కార్‌ చర్యలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశ వ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలో వైరస్‌ ద్వారా వచ్చే వ్యాధులు భయం గొల్పుతున్నాయి. ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న జనం..మరోవైపు అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్‌ బారిన పడుతున్నారు. 15 ఏళ్ల వయసు దాటిన వారిలో దేశవ్యాప్తంగా 0.9 శాతం మంది హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి బాధితులుండగా..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2.3 శాతం మంది ఉన్నట్లు తాజాగా ఎన్‌సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ) వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు దీనిపై తక్షణమే సత్వర చర్యలు చేపట్టాలని సూచించింది. హెపటైటిస్‌ ఎ, బి, సి, డితో పాటు హెపటైటిస్‌ ఇ వైరస్‌ కూడా ఉంది. ఈ వైరస్‌ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికోసం ఏపీ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా నియంత్రణకు చర్యలు చేపట్టింది.

లక్ష మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ పూర్తి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే లక్ష మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు హెపటైటిస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేశారు. అంతేకాదు 101 జైళ్లలో ఉన్న 5,900 పైచిలుకు ఖైదీలకూ స్క్రీనింగ్‌ నిర్వహించి వ్యాక్సిన్‌ వేశారు. ఖైదీల్లో మరింత ఎక్కువగా హెపటైటిస్‌ బి వ్యాధులు కనిపించాయి. రాష్ట్రంలో సగటున 2.3 శాతం ఉండగా.. ఖైదీల్లో 2.7 శాతం మందికి నిర్ధారణ అయ్యింది.

మరో 8 లక్షల మందికి వ్యాక్సిన్‌
రాష్ట్రంలో రిస్క్‌ గ్రూపులుగా చెప్పుకునే వాళ్లకు వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఐవీ, క్షయ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, సెక్స్‌ వర్కర్లు, ఎంఎస్‌ఎం (మేల్‌ సెక్స్‌ విత్‌ మేల్‌)కు వేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ.5 కోట్లు వ్యయం చేసి వ్యాక్సిన్‌ వేయనుంది.  560కి పైగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో అందరికీ హెపటైటిస్‌ స్క్రీనింగ్‌ చేయనున్నారు.  

నివారణ ఇలా..
► శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్‌–ఏ వైరస్‌ను నివారించవచ్చు
► హెపటైటిస్‌ బి, సి  రక్తమార్పిడి వల్ల వస్తాయి. శుభ్రంగా లేని సిరంజీలు, నీడిల్స్‌ వాడడం వల్ల వస్తాయి.  
► ప్రతి గర్భిణికి ప్రసవానికి ముందు హెపటైటిస్‌ టెస్టు చేసి, బిడ్డకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
► హెపటైటిస్‌ –సి మూడు నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుంది.  
► మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే  ఉచితంగా ఇస్తారు.
► విశృంఖల శృంగారం వల్ల హెపటైటిస్‌ బి, సి వస్తాయి.  చిన్న పిల్లలకూ విధిగా హెపటైటిస్‌ టీకాలు వేయించాలి 

మరిన్ని వార్తలు