పీసీబీ తనిఖీలను అడ్డుకోవద్దు

27 Jul, 2021 03:53 IST|Sakshi

పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం పీసీబీకి ఉంది

తనిఖీలకు పూర్తిస్థాయిలో సహకరించండి

అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఉందని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. పీసీబీ తనిఖీలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం చేయొద్దని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. తనిఖీలకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. అలాగే తనిఖీలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని పీసీబీని కోరింది. తనిఖీలకు వెళ్లే ముందు అమరరాజా బ్యాటరీస్‌కు నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆ సంస్థ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చీ, జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్‌ మూసివేతకు పీసీబీ ఏప్రిల్‌ 30న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటిని సవాల్‌ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. 

తనిఖీలను అడ్డుకుంటోంది..
పీసీబీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐఐటీ నిపుణులతో కూడిన బృందం తనిఖీలకు వెళ్తే వారిని అమరరాజా బ్యాటరీస్‌ తన ప్రాంగణంలోకి అనుమతించడం లేదని తెలిపారు. తనిఖీలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తోందని వివరించారు. ఈ కంపెనీ టీడీపీ ఎంపీదని.. అందువల్ల ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ఐఐటీ నిపుణులతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కంపెనీ ఉద్యోగుల రక్తంలో సీసం ఆనవాళ్లు ఉన్నాయని, పూర్తి వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత పీసీబీపై ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. తనిఖీలు చేపట్టకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అమరరాజా యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఆ సంస్థ తరఫు న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ.. పీసీబీకి సంబంధం లేని థర్డ్‌ పార్టీ వారిని మాత్రమే అనుమతించడం లేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 8 మంది ఉద్యోగులను సీసం రహిత ప్రాంతానికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. పీసీబీ వెంట ఉన్నది ఐఐటీ నిపుణులే తప్ప థర్డ్‌పార్టీ కాదని మోహన్‌రెడ్డి చెప్పారు. నిపుణుల సాయం తీసుకునే అధికారం పీసీబీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు