108 సేవలకు రూ.725 కోట్లు

3 Oct, 2023 06:00 IST|Sakshi

నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలుకు భారీగా వ్యయం

సగటున రోజూ మూడు వేల మందికి అత్యవసర సేవలు 

నిర్వీర్యమైన వ్యవస్థకు ఊపిరి పోసిన సీఎం జగన్‌ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. ఫోన్‌ చేసిన నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని బాధితు­లను వేగంగా ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం టీడీపీ హయాంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు ఊపిరి పోసింది. 768 అంబులెన్స్‌ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు ఇప్పటి వరకూ రూ.589 కోట్లను ఖర్చు చేయగా కొత్త వాహనాల కొనుగోలుకు మరో రూ.136 కోట్లకుపైగా వ్యయం చేయడం గమనార్హం.

గర్భిణులే అత్యధికం..
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేల మందికి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి 36 లక్షల మంది సేవలు పొందారు. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులుండగా 14 శాతం కిడ్నీ బాధితులు, 11 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులున్నారు.

నిర్వహణకు ఏటా రూ.188 కోట్లకు పైగా
రోడ్డు ప్రమాదాల బాధితులు, గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఎంత త్వరగా ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్‌ల నిర్వహణ, ఉచితంగా అత్యవసర రవాణా సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. క్షేత్ర స్థాయిలో అంబులెన్స్‌ కార్యకలాపాల కోసం 3700 మందికి పైగా విధులు నిర్వహిస్తుండగా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌లో మరో 311 మంది సిబ్బంది పని చేస్తున్నారు.

వీరికి వేతనాలతో పాటు అంబులెన్స్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. ఏడాదికి రూ.172.68 కోట్లను నిర్వహణ కోసం కేటాయిస్తోంది. దీనికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు చొ­ప్పున ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి మొత్తం రూ.188 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది.

గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనాలు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉండగా మండలానికి ఒక అంబులెన్స్‌ కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి తెర దించుతూ సీఎం జగన్‌ 2020 జూలై 1న ఏకంగా 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది.

ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా 20 కొత్త అంబులెన్స్‌లను రూ.4.76 కోట్లతో 2022 అక్టోబర్‌లో అదనంగా కొనుగోలు చేశారు. దీంతో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీకిపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చా­రు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం మరో రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ఇలా రూ.136.02 కోట్లు అంబులెన్స్‌ కొనుగో­లుకు వెచ్చించారు. తద్వారా నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు కోసం రూ.725.02 కోట్లు ఖర్చు చేశారు.

మరిన్ని వార్తలు