అదానీ, అంబానీల చూపు.. ఏపీ వైపు.. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం: సీఎం జగన్‌

16 Aug, 2022 13:18 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్‌ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా ప్రకటించారు సీఎం జగన్‌.  ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 2023 నాటికి రెండో పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్న ఆయన.. ఒక ప్రాంతం అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి అని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. 

ఈ మూడేళ్లలో ఏపీకి 17 భారీ పరిశ్రమల ద్వారా 39, 350 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం జగన్‌.. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రానున్నాయని చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రంగంలోనూ 31,671 పరిశ్రమలు రూ.8,285 కోట్లు పెట్టుబడులు పెట్టాయన్నారు. మూతపడ్డ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు చేయూతనిస్తున్నట్లు.. రూ.1,463 కోట్లతో ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించారు.

గతంలో అదానీ సంస్థ పేరు మాత్రం చెప్పుకునే వాళ్లు. కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదానీ అడుగులు ఏపీలో పడ్డాయని, అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్‌ గుర్తు చేశారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు.. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు లక్ష వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని.. 9 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీనే అనే విషయాన్ని వేదిక సాక్షిగా ప్రకటించారు సీఎం జగన్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు