సంతోషం ఖరారు!

26 Jun, 2022 08:10 IST|Sakshi

అనంతపురం రూరల్‌: రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాసైన సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసింది. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ పీఆర్సీ ప్రకారం జూలై నుంచి జీతాలు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించింది. ఉద్యోగుల పే స్కేల్‌ను సైతం ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్‌ సెక్రటరీలకు బేసిక్‌ పే రూ.23,120 నుంచి రూ.74,770, ఇతర ఉద్యోగులకు బేసిక్‌ పే రూ.22,460 నుంచి రూ.72,810 ఉండేలా నిర్ణయించింది.

ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ పొందిన 7,393 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రూ.15వేల వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆగస్టులో పెరిగిన జీతాలు అందుకోనున్నారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. విధుల్లోకి చేరిన రెండు సంవత్సరాలకే తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  రుణపడి ఉంటామని, ఇక నుంచి మరింత బాధ్యతగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు 
రాప్తాడు: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్, రెగ్యులర్‌ జీతాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సచివాలయ ఉద్యోగులంతా రుణపడి ఉంటామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి పేర్కొన్నారు.  శనివారం హంపాపురం సచివాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి కేక్‌ కట్‌ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.  

చాలా సంతోషంగా ఉంది 
ఇచ్చిన మాట ప్రకారం సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసి పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.  
– నదియా, విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్, రెడ్డిపల్లి సచివాలయం, బుక్కరాయసముద్రం మండలం 

పారదర్శకంగా సేవలు 
సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు వచ్చాయి. ఎవరి సిఫార్సులూ లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలందించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోంది. రెండేళ్లలోనే సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం చాలా గొప్ప విషయం.  
– జయప్రకాష్, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, ఉదిరిపికొండ, కూడేరు మండలం 

(చదవండి: పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు)

మరిన్ని వార్తలు