AP: సాగు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు

2 May, 2022 12:34 IST|Sakshi

తూర్పుమధ్య డెల్టాల్లో మరమ్మతులు

రూ.43 కోట్లతో 275 పనులకు ఆమోదం

కాకినాడ డ్రైనేజీ డివిజన్‌లో ఆధునీకరణ

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఖరీఫ్‌ సాగు పనులు ప్రారంభమయ్యే నాటికి గోదావరి డెల్టా రైతుల నీటి కష్టాలను కడతేర్చే దిశగా ముందస్తు కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.43 కోట్లపై చిలుకు విలువైన 275 పనులకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఏటా రబీ సీజన్‌ ముగియగానే కాటన్‌ బ్యారేజీ నుంచి గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా పంట కాలువలకు నీటిని నిలుపు చేస్తారు. తిరిగి ఖరీఫ్‌ సాగుకు నీటి సరఫరాను ప్రారంభిస్తారు. 

కాలువలు మూసివేసి, తిరిగి తెరిచే లోగా వాటి పటిష్టత, పూడికతీత, ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులు చేపడుతుంటారు. వీటిని క్లోజర్‌ పనులని అంటారు. ఈ పనుల ద్వారా ఖరీఫ్‌ సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారు. గతంలో పంట కాలువలు మూసేసినప్పటికీ సకాలంలో ఆమోదించకపోవడం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో క్లోజర్‌ పనులు పూర్తయ్యేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్‌ అధికారులు క్లోజర్‌ పనులపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

కోనసీమ జిల్లాలో అత్యధికం 
ఈసారి మొత్తం క్లోజర్‌ పనుల్లో మూడు వంతులు పైగా కోనసీమ జిల్లాలోనే చేపట్టనున్నారు. అక్కడే ఆయకట్టు ఎక్కువగా ఉండటంతో అందుకు తగ్గట్టు పనులు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటికీ కలిపి రూ.43,09,77,000 మంజూరు చేస్తే ఇందులో కోనసీమ జిల్లాకు అత్యధికంగా రూ.34,93,32,000 కోట్లు కేటాయించారు.

మిగిలినది తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు కేటాయించారు. అమలాపురం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలో బెండా కెనాల్, జనుపల్లి హెడ్‌ స్లూయీజ్‌కు నడిపూడి గ్రామ పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నారు. చెయ్యేరు చానల్‌ – గున్నేపల్లి బ్రాంచి కెనాల్స్, అల్లవరం చానల్, కౌశిక చానల్, అమలాపురం చానల్‌ నుంచి చిందాడగరువు చానల్, పి.గన్నవరం కెనాల్‌ నుంచి అమలాపురం కెనాల్‌ వరకు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పలు కాలువలను అభివృద్ధి చేయనున్నారు. కోనసీమలో అత్యధికంగా రాజోలు నియోజకవర్గంలో 52 పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.

టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం
ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) పనుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాం. దీనిపై అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు వేగవంతం చేస్తాం. 
– బి.రాంబాబు, ఎస్‌ఈ,ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌

రైతులకు లబ్ధి
డెల్టా కాలువలకు నీటిని నిలిపివేసిన అనంతరం చేపట్టే ఓ అండ్‌ ఎం పనులతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడికతీతతో పాటు గేట్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టడం ద్వారా శివారు ప్రాంతాలకు కూడా ఇబ్బందులు లేకుండా నీరు చేరుతుంది. ఈ పనులకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది. 
– జిన్నూరి వెంకటేశ్వరరావు,వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పు గోదావరి 

 

మరిన్ని వార్తలు