పంటల నమోదుతో తంటాలకు చెక్‌

11 Jul, 2021 03:17 IST|Sakshi

ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే చాలు

ధాన్యం సహా అన్ని పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఇదే ఆధారం

వాస్తవ సాగుదారులకు మేలు కలిగేలా సంస్కరణలు

ఖరీఫ్‌–2021 నుంచి అమలుకు శ్రీకారం

సాక్షి, అమరావతి: పంటల నమోదులో తలెత్తుతున్న ఇబ్బందులకు చెక్‌ పెడుతూ రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం (ఆర్‌బీయూడీపీ) ద్వారా పంటల వివరాలను పకడ్బందీగా నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వాస్తవ సాగుదారులకు మేలు కలిగేలా ఖరీఫ్‌–2021 సీజన్‌ నుంచి పంటల నమోదు (ఈ–క్రాప్‌ బుకింగ్‌)లో సంస్కరణలు తీసుకొచ్చింది. పంటను అమ్ముకోవడానికే పరిమితం కాకుండా.. సాగు ఉత్పాదకాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి ఏ లబ్ధి పొందాలన్నా పంటల నమోదే ప్రామాణికం. 

మూడు దశల్లో నమోదు ప్రక్రియ
ఆర్‌బీయూడీపీలో పంటల నమోదు ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. పంట నమోదు, ధ్రువీకరణ, పర్యవేక్షణ ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రైతులు తమ పొలాల్లో నాట్లు వేసిన వారంలోపు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి తాము ఎంత విస్తీర్ణంలో ఏయే రకాల పంటలు సాగు చేస్తున్నామనే వివరాలను వీఏఏ/వీహెచ్‌ఏల ద్వారా నమోదు చేయించుకోవాలి. రైతులు తమ ఆధార్, భూమి గుర్తింపు పత్రాలు (పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేదా సీసీఆర్‌సీ కార్డు), బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబర్‌ వివరాలను తీసుకెళ్లాలి. ఆధార్‌ డేటా బేస్‌తో అనుసంధానించిన ఆర్‌బీయూడీపీలో ఈ వివరాలన్నీ నమోదు చేస్తారు. ఆధార్‌/భూమి ఖాతా/సర్వే నంబర్ల ఆధారంగా రైతు వ్యవసాయ భూమిని యూడీపీ శోధించి రైతు ఈ కేవైసీతో సరి పోల్చుకుని పంటల నమోదును ధ్రువీకరిస్తుంది.

ఆ తర్వాత భూమి రికార్డు ఆధారంగా పంటల వివరాలతో సహా రైతు సమక్షంలోనే ఆన్‌లైన్‌లో జియో ఫెన్సింగ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రైతు మొబైల్‌కు మెసేజి రూపంలో సమాచారం వస్తుంది. విస్తీర్ణం పెరిగినా, పంటలు మార్చుకున్నా ఆర్‌బీకేలో నమోదు చేయించుకోవచ్చు. నమోదైన రెండు వారాల తర్వాత వీఏఏలు సంబంధిత పొలాలకు వెళ్లి పంటలను పరిశీలిస్తారు. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక పొలం ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయగానే మొబైల్‌ ద్వారా రైతుకు డిజిటల్‌ రసీదు వెళ్తుంది. ఆర్‌బీకే నుంచి కూడా ప్రింటెడ్‌ రసీదు పొందవచ్చు. నమోదు చేసుకున్న పంట వివరాలకు, క్షేత్రస్థాయి పరిశీలనలో గమనించిన వివరాలు భిన్నంగా ఉంటే రికార్డుల్లో మార్పులు చేసి రసీదు పంపిస్తారు. నమోదైన ఆయా పంటల స్థితిగతులను పరిశీలించేందుకు వీఏఏ/వీహెచ్‌ఏలు దశలవారీగా క్షేత్రస్థాయి సందర్శన చేస్తారు. పంట పరిస్థితిని పరిశీలించి సాగులో అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. అవసరమైతే శాస్త్రవేత్తలతో మాట్లాడించి సస్యరక్షణ చర్యలు తెలియజేస్తారు. అవసరమైతే పంట నమూనాలను అగ్రి ల్యాబ్‌లకు పంపి సామూహిక నివారణ చర్యలకు సిఫారసు చేస్తారు.

మార్కెటింగ్‌లోనూ చేయూత
రాష్ట్రంలో పండించిన పంటలు రైతు వివరాలతో సహా వ్యాపారులకు ఆర్‌బీయూడీపీ ప్లాట్‌ఫామ్‌లో కన్పిస్తాయి. తద్వారా వ్యాపారులు నేరుగా రైతులతో మాట్లాడి పంటల్ని కొనుగోలు చేయొచ్చు. ఆర్‌బీయూడీపీలోని వివరాల ఆధారంగానే రైతులకు రాయితీలు, పరిహారాలు అందిస్తారు.

జియో ఫెన్సింగ్‌ ద్వారా నమోదు
పంటల నమోదు విషయంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఆర్‌బీయూడీపీని డిజైన్‌ చేశాం. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల ఎకరాల భూమిలో జియో ఫెన్సింగ్‌ ద్వారా పంటల వివరాలను నమోదు చేయబోతున్నాం.   
 – హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్‌ వ్యవసాయశాఖ 

మరిన్ని వార్తలు