పరిషత్‌ ఎన్నికలు మళ్లీ పెట్టండి

22 May, 2021 02:48 IST|Sakshi

‘సుప్రీం’ ఆదేశాలు అమలు చేయండి

ఎక్కడ ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచే పెట్టండి

4 వారాల గడువుతో తాజా నోటిఫికేషన్‌ ఇవ్వండి

ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం

ఏప్రిల్‌ 1 నోటిఫికేషన్‌ చట్ట విరుద్దం

సుప్రీం తీర్పును ఎన్నికల కమిషనర్‌ సరిగా అర్థం చేసుకోలేదు

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీలో తొందరపాటు ప్రదర్శించారు

తీర్పులో న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలు

మొదటి నుంచి ఎన్నికలు పెట్టాలన్న బీజేపీ అభ్యర్థన తిరస్కృతి

వర్ల రామయ్య పిటిషన్‌ కొట్టివేత

జనసేన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించిన హైకోర్టు  

సాక్షి, అమరావతి: పోలింగ్‌ ప్రక్రియ పూర్తయి అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదు కాబట్టి ఈ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలి. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేస్తూ, ఎన్నిల నిర్వహణ నిమిత్తం తాజా నోటిఫికేషన్‌ జారీ చేయాలి.

ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్‌ ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అది చట్టవిరుద్ధమైన నోటిఫికేషన్‌ కనక దానిని రద్దు చేస్తున్నాం’’ అని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఎన్నికల్లో పోటీ విషయంలో జససేన పార్టీ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా ఆ నోటిఫికేషన్‌ లేదని కూడా హైకోర్టు ఆక్షేపించింది. ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే విషయంలో రాజ్యాంగంలోని అధికరణ 243ఓ ప్రకారం ఎలాంటి నిషేధం లేదని కోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఈ నోటిఫికేషన్‌ వల్ల తన చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించడంలో వర్ల రామయ్య విఫలమయ్యారని, అందువల్ల ఫలానా విధంగా వ్యవహరించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరజాలరని హైకోర్టు తేల్చి చెప్పింది. పరిషత్‌ ఎన్నికలు గతంలో ఎక్కడ నిలిచిపోయాయో ఆ దశ నుంచి కాకుండా మొదటి నుంచి తిరిగి నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత పాతూరి నాగభూషణంతో పాటు మరికొందరు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయాలన్న జనసేన పార్టీ పిటిషన్‌ను న్యాయమూర్తి పాక్షికంగా అనుమతించారు.

 
టీడీపీ, బీజేపీ, జనసేన వేర్వేరుగా పిటిషన్లు... 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ తెలుగుదేశం నేత వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మొదట విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ పరిషత్‌ ఎన్నికలను ఆపేస్తూ ఏప్రిల్‌ 6న ఉత్తర్వులిచ్చారు. వీటిపై ఎన్నికల కమిషన్‌ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీలు చేసింది.

విచారణ జరిపిన ధర్మాసనం... షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిని మాత్రం చేపట్టొద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై తుది విచారణ జరిపి తీర్పునివ్వాలని సింగిల్‌ జడ్జిని ధర్మాసనం కోరింది. అయితే పరిషత్‌ ఎన్నికలు ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి నిర్వహించే నిమిత్తం ఈసీ ఏప్రిల్‌ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తాజాగా నామినేషన్లు దాఖలు చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

అలాగే ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ నేత నాగభూషణం తదితరులు మరో పిటిషన్‌ వేశారు. వీటన్నిటిపై న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. శుక్రవారం ఆయన టీడీపీ, జనసేన పిటిషన్లలో ఉమ్మడి తీర్పు, బీజేíపీ పిటిషన్‌లో వేరుగా తీర్పు వెలువరించారు. వర్ల రామయ్య, బీజేపీ పిటిషన్లను కొట్టేసిన న్యాయమూర్తి, జనసేన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించారు. న్యాయమూర్తి తన తీర్పులో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీ తీరును తప్పుపట్టారు. ఎన్నికల కమిషనర్‌ను ఉద్దేశించి ఘాటైన పదజాలం ఉపయోగించారు.  

ఎన్నికల కమిషనర్‌ సొంత భాష్యం చెప్పారు... 
‘ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల పట్ల ఎన్నికల కమిషనర్‌ అవిధేయత చూపుతూ ఏప్రిల్‌ 8న ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ ఇస్తూ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు లేకుండా చేశారు. దీంతో జనసేన పార్టీ అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఎన్నికల కమిషనర్‌ గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తరువాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు తీసుకున్న రోజునే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పునః ప్రారంభించారు.

ధృవీకరించిన కౌంటర్‌ను దాఖలు చేయలేదు. కారణాలేంటో ఆమెకే తెలుసు. కోర్టు తీర్పును ఆసాంతం చదవాలి. తీర్పులో అక్కడ కొంత, ఇక్కడ కొంత తీసుకుని దాని ఆధారంగా భాష్యం చెప్పడానికి వీల్లేదు. ఎన్నికల కమిషనర్‌ సుప్రీంకోర్టు తీర్పును చదవకుండా సొంత భాష్యం చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి అన్న నిర్ణయానికి వచ్చారు. దీన్ని ఆమోదించబోం.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్‌ 1 నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ఈ కోర్టు భావిస్తోంది. సుప్రీం ఆదేశాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే. అయితే రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్‌ మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులను అగౌరవపరించింది. అందువల్ల ఏప్రిల్‌ 1న ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నా’ అని జస్టిస్‌ సత్యనారాయణమూర్తి తన తీర్పులో వివరించారు. 

ఎన్నికల కమిషనర్‌ తొందరపాటు వల్ల అంత ఖర్చు... 
‘గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హింస, దౌర్జన్యాలు జరిగాయన్న కారణంతో ఎన్నికల ప్రక్రియను మొత్తం రద్దు చేసి తాజా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశామని, అందువల్ల మళ్లీ ఎన్నికలకు ఆదేశిస్తే ఖజానాపై భారం పడుతుందన్న ఎన్నికల కమిషన్‌ తరపు సీనియర్‌ న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చుతోంది. గతంలో సింగిల్‌ జడ్జి ఎన్నికలను నిలిపేసినప్పుడు, ప్రభుత్వం చాలా హడావుడిగా ధర్మాసనాన్ని ఆశ్రయించి, ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు పొందింది. అప్పుడు ప్రభుత్వం కొంత ఓపిక పట్టి ఉంటే, ఎన్నికలకు ఖర్చు పెట్టిన డబ్బును కొంత కాలం వరకైనా ఆదా చేసి ఉండేది’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు