‘జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టం’.. అభ్యంతరం ఏమీ లేదు

9 Nov, 2021 04:36 IST|Sakshi

పేరులో ‘జ్యుడిషియల్‌’ అని ఉంటే నష్టం ఏమిటి?

పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్న

తదుపరి విచారణ 29కు వాయిదా 

సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టం విషయంలో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చట్టం పేరులో జ్యుడిషియల్‌ అని ఉన్నంత మాత్రాన, అది కోర్టులు నిర్వర్తించే విధులు నిర్వర్తిస్తున్నట్లు కాదని స్పష్టంచేసింది. పేరులో జ్యుడిషియల్‌ అని ఉండ టం వల్ల వచ్చిన నష్టం ఏముందని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే న్యాయశాఖ ఉండగా.. ఆ శాఖను కాదని, జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టం కింద ఏర్పాటైన రిటైర్డ్‌ జడ్జి సలహాలు తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ తిరుపతికి చెందిన వ్యాపారి యల్లపల్లి విద్యాసాగర్‌ గతేడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలో ఎక్కడా జ్యుడిషియల్‌ ప్రివ్యూ అన్న పదమే లేదన్నారు. జ్యుడిషియల్‌ రివ్యూ ఉందని, దీనిపై పూర్తిగా న్యాయస్థానాలకే అధికారం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పేరులో జ్యుడిషియల్‌ అని ఉన్నంత మాత్రాన ఆ చట్టం కింద ఏర్పాటైన రిటైర్డ్‌ జడ్జి కోర్టు విధులను నిర్వర్తించరని గుర్తు చేసింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదంది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ.. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్ల ప్రక్రియను ఈ జ్యుడిషియల్‌ ప్రివ్యూ పరిశీలిస్తుందన్నారు. టెండర్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఇందులో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు లేవని తెలిపారు.    

మరిన్ని వార్తలు