విద్యార్థుల ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు.. అది కూడా ఉచితంగానే.

12 Dec, 2022 11:01 IST|Sakshi

దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు

పూర్తి ఉచితంగానే సర్టిఫికెట్లు పంపిణీ

అర్హత, సామాజిక పరిస్థితి ఆధారంగా జారీ

టెన్త్, ఇంటర్‌ విద్యార్థుల జాబితా 

వీఆర్వోల యాప్‌కు అనుసంధానం

వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే సర్టిఫికెట్‌

పది లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం

మూడేళ్ల క్రితం..
ఓ పల్లెటూరి కుర్రాడికి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యాయి. దగ్గరలో ఉన్న పట్నం వెళ్లాడు. రూ. 50 ఫీజు కట్టి మీ సేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకొన్నాడు. దీనికి ఒక రోజంతా పట్టింది. వారం పది రోజులు మండలాఫీసుల చుట్టూ తిరిగాడు. అప్పటికి గాని సర్టిఫికెట్లు రాలేదు. లంచం వంటివి అదనంగా  ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం..
అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాల అవసరం వచ్చింది. నేరుగా అదే గ్రామంలోని గ్రామ సచివాలయానికి వెళ్లాడు. అక్కడే ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసి నిమిషాల్లో ఇంటికి వచ్చేశాడు. మండలాఫీసుల చుట్టూ తిరగలేదు. ఎవరినీ కలవాల్సిన పనిలేదు. సర్టిఫికెట్లు చేతికందాయి. 


ఇక మీదట 
ఈ మాత్రం కష్టం కూడా ఉండదు. దరఖాస్తు చేసుకోకపోయినా పది, ఇంటర్‌ చదివే విద్యార్థులకు వారి అర్హత, సామాజిక పరిస్థితి ఆధారంగా ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రభుత్వమే వారి ఇళ్లకు తీసుకొచ్చి అందజేయనుంది. అది కూడా ఉచితంగానే. 

సాక్షి, అమరావతి: ఆదాయ (ఇన్‌కం), కుల (క్యాస్ట్‌) ధ్రువీకరణ సర్టిఫికెట్లకు డిమాండ్‌ చాలా ఎక్కువ. విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌  మంజూరులో, ఉన్నత చదువుల సీట్ల కేటాయింపుల్లో ఇవే కీలకం. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పొందాలన్నా ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. మూడేళ్ల క్రితం వరకు వీటి కోసం విద్యార్థులు నానా తిప్పలు పడేవారు. పట్టణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ– సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్కొక్క సర్టిఫికెట్‌కు  రూ. 40 నుంచి 50 వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు సరేసరి.


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విప్లవాత్మకంగా తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో పేదలకు ఈ ఇబ్బందులు తప్పాయి. గ్రామంలో, వార్డుల్లో ఉండే సచివాలయాల్లోనే సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. ఇంటికి దగ్గరలోనే ఉండే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకొంటే నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చేవి. ఫీజు మామూలుగానే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, పేదలకు ఈమాత్రం కష్టంకూడా లేకుండా, అసలు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు లేకుండా సర్టిఫికెట్లను ఇంటి వద్దకే అందజేసే ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ సూచన మేరకు  గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది. 


జారీ ఇలా.. 

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో పది, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోల మొబైల్‌ యాప్‌కు అనుసంధానం చేశారు. వీఆర్వోలు ఆ జాబితా ప్రకారం తమ పరిధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ  ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)కి నివేదిక ఇస్తారు. ఆర్‌ఐ పరిశీలన చేసి మండల తహసీల్దార్‌కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్‌ అర్హులకు సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్లను సచివాలయాల వారీగా డౌన్‌లోడ్‌ చేస్తారు. వలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి ఆ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సోమవారంలోగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనుంది. 

టెన్త్‌లో 6 లక్షల మంది, ఇంటర్‌లో 10 లక్షల మంది! 
రాష్ట్రంలో ఏటా పదో తరగతిలో 6 లక్షల నుంచి 6.5 లక్షల మంది, ఇంటర్‌ రెండు సంవత్సరాలు దాదాపు 10  లక్షల మంది చదువుతుంటారని అంచనా. వీరిలో దాదాపు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారేనని అధికార వర్గాలు చెప్పాయి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఇళ్ల వద్దే ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణ­యం­తో 10లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు.

సచివాలయ వ్యవస్థ కారణంగానే ఈ వెసులుబాట్లు 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పరిపాలనలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటివరకు ప్రజలకు కష్టసాధ్యంగా ఉండే ప్రభుత్వ సేవలు కూడా ఇప్పుడు ఇంటి వద్దే అందుతున్నాయి. కుగ్రామంలో ఉండే ప్రజలు కూడా ఊరు దాటి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే ఐదు కోట్లకు పైగా సేవలను ఈ ‘సచివాలయా’లే అందించాయి. నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు ప్రతి నెలా పింఛను డబ్బుల కోసం ఆ గ్రామంలో పంచాయతీ ఆఫీసు లేదంటే గ్రామ పెద్ద ఇంటిదాకా వెళ్లే  ఇబ్బందులు మూడేళ్ల క్రితమే తొలగిపోయాయి. 34 లక్షల మంది వృద్ధులు (కేవలం వృద్ధాప్య పింఛన్లు), మరో 50 వేల మందికి పైగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే విధానాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇంటి వద్దనే అందజేసే ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది.

మరిన్ని వార్తలు