త్వరలోనే ఏపీలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పాలసీని తీసుకొస్తాం: కన్నబాబు

4 Oct, 2021 15:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో స్పష్టమైన ప్రణాళికలు చేస్తున్నాం అన్నారు. ఎఫ్‌పీఓలు, ఎన్‌జీఓలు, అధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి కన్నబాబు సోమవారం అమరావతి ఏపీఐఐసీ బిల్టింగ్‌లో సమావేశం నిర్వహించారు. రైతులు, ఎఫ్‌పీఓలు, ఎన్‌జీఓల నుంచి సేంద్రియ వ్యవసాయపు అనుభవాలు, సలహాలను మంత్రి కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ‘‘రైతులకు రెట్టింపు ఆదాయంతో పాటు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు చేరేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీకే కేంద్రంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీఎం ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయానికి సహాయంగా రెండు దశల్లో 5,000 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు. 
(చదవండి: సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి: కన్నబాబు)

పొలంబడి ద్వారా వ్యవసాయ, ఉద్యాన వన వర్సిటీలు.. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులను చైతన్య పరచాలి. ఉత్పత్తులు తగ్గకుండా రసాయనాలు, పురుగు మందులను తగ్గిస్తూ, క్రమేపి వాటి వినియోగాన్ని కనీస స్థాయికి తీసుకురావాలి. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని అలవాటు చేయాలి’’ అన్నారు.
(చదవండి: కోవిడ్‌ సాగు: షుగర్‌ క్వీన్‌.. తియ్యటి పంట)

ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు, ఎప్‌పీఓలు, ఎన్‌జీఓలు సర్టిఫికేషన్, శిక్షణ, పనిముట్ల పంపిణి, మార్కెటింగ్ సౌకర్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం, రైతులకు కసాయాలు, ఘన జీవామృతం అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై సలహాలిచారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ఉన్నతాధికారులు  టి విజయ కుమార్, స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య , అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ , హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ , యూనివర్సిటీ వీసీ జానకిరామ్ , ఏపీ సీడ్స్ ఎండి శేఖర్ బాబు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర , సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు

మరిన్ని వార్తలు