‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం

17 Sep, 2023 05:27 IST|Sakshi

మూడో దశలో అక్టోబర్‌ 15 నాటికి 25.42 లక్షల రాళ్లు అందించడమే లక్ష్యం

గ్రానైట్‌ ఫ్యాక్టరీల నిర్వాహకులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్‌ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్‌ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్‌ సిస్టమ్‌ తెచ్చారని, విద్యుత్‌ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్‌ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు.

రీసర్వే కోసం గతంలో గ్రానైట్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమా­వేశం­లో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరి­యల్‌ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు