ప్రజలే కుటుంబం.. ప్రజా రక్షణే కర్తవ్యం

10 May, 2021 04:09 IST|Sakshi
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో మండుటెండలో కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు

కరోనా కట్టడిలో ఏడాదిగా అలుపెరుగని ఖాకీలు

ఫస్ట్‌ వేవ్‌లో లాక్‌డౌన్, సెకండ్‌ వేవ్‌లో కర్ఫ్యూ, మధ్యలో ఎన్నికల విధులు

ఏపీ పోలీసులకు ప్రజల ప్రశంసలు

సాక్షి, అమరావతి: కరోనా కట్టడిలో ఏడాది కాలంగా ఏపీ పోలీసులు అలుపెరుగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాదిలో వచ్చిన కరోనా ఫస్ట్‌ వేవ్‌ నుంచి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్‌ వేవ్‌ వరకు వరుస విధుల్లో శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో 70 వేల మందికి పైగా పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం కోవిడ్‌ విధుల్లో తలమునకలయ్యారు. కరోనా పరిస్థితుల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ప్రజలే కుటుంబంగా, ప్రజా రక్షణే కర్తవ్యంగా భావిస్తూ విధులు నిర్వర్తిస్తున్న ఏపీ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఫస్ట్‌ వేవ్‌లో అలా..
కరోనా మొదటి వేవ్‌లో లాక్‌డౌన్, జోన్‌ సిస్టమ్‌లు అమలు చేయడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణతో పాటు, డ్రోన్‌లు, హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌ వంటి టెక్నాలజీని వాడి సమర్థవంతంగా కరోనాను కట్టడి చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంతోపాటు, వారి ప్రథమ కాంటాక్ట్, రెండవ కాంటాక్ట్‌లను గుర్తించి వైరస్‌ పరీక్షలు నిర్వహించడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు. వలస కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో పునరావాస శిభిరాలను నిర్వహించారు.

సెకండ్‌ వేవ్‌లో ఇలా..
సెకండ్‌ వేవ్‌లో కరోనా కట్డడికి ప్రభుత్వం కర్ఫ్యూను అమలులోకి తేవడంతో పోలీసులు మూడు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలించినప్పటికీ, 144 సెక్షన్‌ అమలుతో ప్రజలు గుమికూడకుండా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కర్ఫ్యూలో అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించటంతో వాటిపైనా నిఘా ఉంచారు. కర్ఫ్యూ అమలును రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి, జిల్లా, నగర కేంద్రాల నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ విధులతోపాటు, పంచాయతీ, మునిసిపల్, పరిషత్‌ ఎన్నికల విధులూ నిర్వర్తించారు. ఇప్పటికీ జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్‌ బాక్సులకు కాపలా, కర్ఫ్యూ అమలు వంటి వరుస విధుల్లో తలమునకలయ్యారు. 

మరిన్ని వార్తలు