ఏది నిజం?: బాధితులనే.. దోషుల్ని చేస్తారా? పాత్రికేయమంటే ఇదేనా డ్రామోజీ?

16 Apr, 2023 03:47 IST|Sakshi

వైఎస్‌ జగన్‌పై 2018 అక్టోబర్లో విశాఖలో హత్యాయత్నం

నిందితుడు హతమార్చడానికే ప్రయత్నించాడని తేల్చిన ఎన్‌ఐఏ

పథకం పన్ని హత్య చేయబోయాడని... జగన్‌ తప్పించుకున్నారని ఎన్‌ఐఏ వెల్లడి

అందరి వాంగ్మూలాలూ తీసుకుని... 2019 జనవరి 27న కోర్టుకు ఛార్జిషీట్‌

2019 జనవరి 17న వాంగ్మూలమిచ్చిన నిందితుడు శ్రీనివాసరావు

దాన్ని శనివారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో ప్రచురించిన రామోజీరావు

‘జగన్‌కు సానుభూతి రావాలనే చేశా’ అనే కథనంతో తప్పుదోవ పట్టించే యత్నం

బాధితులను కించపరుస్తూ నిందితులకు కొమ్ముకాయటమూ పాత్రికేయమేనా?

అసలు నాలుగేళ్ల కిందటి వాంగ్మూలాన్ని ఇప్పుడు వేయటంలో అర్థమేంటి?

పైపెచ్చు తాజాగా వెలుగు చూసిందంటూ దగుల్బాజీ రాతలు

అందరి వాంగ్మూలాలనూ అప్పట్లోనే నిందితుడికి, కోర్టుకు ఇచ్చారు కదా?

అప్పట్లోనే ‘ఈనాడు’లో కూడా దాన్ని ప్రచురించారు కదా? ఇన్ని అబద్ధాలేల?

హత్యాయత్నం వెనక కుట్ర ఉందో లేదో తేలుస్తామని అప్పుడే చెప్పిన ఎన్‌ఐఏ

అలా తేల్చడంలో జాప్యం.. త్వరగా పూర్తి చేయాలని జగన్‌ పిటిషన్‌.. దానిపైనే ఇప్పుడు విచారణ.. కుట్ర కోణానికి బలమిచ్చే అంశాలను అప్పట్లోనే బయటపెట్టిన జగన్‌

శ్రీనివాసరావుకు ఉద్యోగమిచ్చిన ఫ్యూజన్‌ఫుడ్స్‌ టీడీపీ నేత హర్షవర్దన్‌ చౌదరిది

ఈయన లోకేశ్‌కు సన్నిహితుడు.. 2014లో గాజువాక నుంచి పోటీకి ప్రయత్నం

శ్రీనివాసరావుపై కేసులేవీ లేవంటూ తప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చి మరీ ఉద్యోగం

దాన్ని నిజం చేసేలా తొలి నుంచీ ‘ఈనాడు’ రాతలు

నేను చెప్పిందే తీర్పు.... నేను రాసిందే చరిత్ర!!.నేను పడుకుంటే అది రాత్రి... నేను నిద్రలేస్తే అది ఉదయం... అనుకునే తెగ బలిసిన మోతుబరి తత్వం రామోజీరావుది.ఎందుకంటే... వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం చేసిన నిందితుడుజనిపల్లి శ్రీనివాసరావు 2019 జనవరి 17నే దర్యాప్తుఅధికారులకు వాంగ్మూలమిచ్చాడు. నిందితుడితో పాటు ఇతర అనుమానితులు, సాక్షులు, బాధితుడు వైఎస్‌ జగన్‌ తాలూకు వాంగ్మూలాలన్నీ తీసుకున్నాక కొంతమేర దర్యాప్తు జరిపి 2019 జనవరి 27న దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ కోర్టుకు చార్జిషీట్‌ను సమర్పించింది. అందులో... అది హత్యాయత్నమేనని నిర్ధారించింది.

వైఎస్‌ జగన్‌ను హతమార్చాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం నిందితుడు అన్నీ చేశాడనిస్పష్టంగా తేల్చింది. దీనివెనక ఏమైనా కుట్ర ఉందా?ఎవరైనా ప్రేరేపించారా? అనే విషయాలు తేల్చడానికి ఇంకా దర్యాప్తు అవసరమని కూడా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ తెలిసేదేమిటి?వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందనేది  వివాదానికి తావులేని అంశం. తేలాల్సిందల్లా... ఆ హత్యా ప్రయత్నం వెనక  ఎవరున్నారనేదే!!. అలా తేల్చడంలో  ఆలస్యమవుతోంది కాబట్టి,  వేగంగా చేసేలా దర్యాప్తు  సంస్థను ఆదేశించాలంటూ తాజాగా  కోర్టులో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు.  ఇదీ జరుగుతున్న వాస్తవం.  

కానీ రామోజీరావు చేస్తున్నదేమిటి? ఎన్‌ఐఏ వేసిన చార్జిషీటును కూడా ప్రస్తావించకుండా... అంతకన్నా ముందు... నాలుగేళ్ల కిందట నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, ఇప్పుడే వెలుగు చూసిందంటూ శనివారంనాడు తన పత్రికలో పతాక శీర్షికన ప్రచురించారంటే ఏమనుకోవాలి? ఈ రామోజీరావు బుద్ధి భూలోకాన్ని దాటి పాతాళానికి పడిపోతున్నదనుకోవాలా?లేక  తెగ బలిసిన మోతుబరి వ్యవహారమనుకోవాలా? హత్యాయత్నం జరిగిందని దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాక... బాధితుడు వైఎస్‌ జగన్‌ను అవమానపరిచేలా, నిందితుడి పక్షాన నిలుస్తూ నిందితుడి ఫోటోలు పతాక శీర్షికల్లో వేస్తూ... ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? బాధితుల్ని వదిలి  నిందితులకు కొమ్ముకాసే  దగాకోరు పాత్రికేయం  చరిత్రలో ఎక్కడైనా  ఉందా? బాధితులనే  దోషులుగా చూపించే  కుట్రలు ఇంకెక్కడైనా జరుగుతాయా?  ఇదేం తీరు  రామోజీరావ్‌? ఇంకెన్నాళ్లు ఇలా..? 


హర్షవర్దన్‌ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను,  ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం.    


నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యూనిఫామ్‌ వేసుకుని, వాటర్‌ బాటిల్‌తో వీఐపీ లాంజ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని,అవకాశం దొరికిన వెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్‌మోహన్‌రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్‌ఐఏ. 

ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్‌ఐఏ.   

కోర్టుకు ఎన్‌ఐఏ సమర్పించిన అఫిడవిట్‌లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం 


జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్‌ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్‌) 


ఏది నిజం?
గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను లేకుండా చేసే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఫలితం... నాటి ఎన్నికల్లో సరైన ప్రతిపక్షమే లేకుండా చేశారు ప్రజలు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆయన రాజగురువు రామోజీకి గానీ బుద్ధి రాలేదు. అప్పటి చీప్‌ట్రిక్స్‌నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు చూద్దాం... 

హత్య జరిగిన రోజే... నిందితుడు శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి పోలీసు కేసులూ లేవని రామోజీరావు రాసేశారు. అంత హడావుడిగా నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘ఈనాడు’ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరు రాయించారు? మరి తనపై ముమ్మిడివరంలో అప్పటికే పోలీసు కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది కదా? దర్యాప్తు జరగకముందే రామోజీకి ఎందుకంత తొందర? ఎవరి ప్రయోజనాల కోసం? 

 నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్‌ సీపీ అభిమాని అని... హత్యాయత్నం జరిగిన రోజే ‘ఈనాడు’ రాసేసింది. దీనికోసం వైఎస్‌ జగన్‌ – శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫ్లెక్సీని సాక్ష్యంగా చూపించింది. కానీ ఆ ఫ్లెక్సీ అప్పటికప్పుడు సృష్టించినదని, నకిలీదని ఆ తరవాత తేలింది. అసలు ‘ఈనాడు’కు ఈ ఫ్లెక్సీ బొమ్మ ఎవరు పంపారు? 

 నిందితుడి సొంత ఊళ్లో ఇసుక కుప్పపై కప్పిన ఫ్లెక్సీని హత్యాయత్నం జరిగిన మూడురోజుల తరవాత అక్కడ చూశామని అక్కడకు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు పేర్కొన్నారు. కానీ నిందితుడి సోదరుడు ఇచ్చి న వాంగ్మూలంలో మాత్రం... ఆ ఫ్లెక్సీ లేదని, వానలకు పోయిందని  చెప్పాడు. వీటిలో ఏది నిజం? వానలకు పోతే ఆ తరవాత పోలీసులకు ఎలా దొరికింది? అంటే అది అప్పటికప్పుడు సృష్టించినదనుకోవాలా? 

 నిందితుడి జేబులో ఓ లేఖ దొరికింది. అందులో... తనకేమైనా అయితే తన అవయవాలు దానం చేయాలని కూడా పేర్కొన్నాడు. ఒకవేళ రామోజీరావు ప్రవచిస్తున్న సిద్ధాంతం ప్రకారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతోనే... ఆయనకు సానుభూతి రావాలనే ఇదంతా చేస్తే తనకేమైనా అవుతుందనే భయం ఉంటుందా? వేరొకరు చెబుతున్నట్టుగా చేసినప్పుడే... తనకు ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఈ లాజిక్‌ ఎలా మిస్సవుతున్నారు రామోజీ? 

జగన్‌ను చంపాలనుకుంటే మాంసం కోయడానికి ఉపయోగించే పెద్ద కత్తి వాడేవాడినని, ఆ ఉద్దేశం లేదు కాబట్టే చిన్న కత్తి వాడానని నిందితుడు చెప్పినట్టు కూడా ‘ఈనాడు’ బాక్సు కట్టి మరీ వేసేసింది. ఎయిర్‌పోర్టులో జనం ఉంటుండగా... అంతమంది మధ్యలోకి వెళ్లేటపుడు పెద్ద కత్తి తీసుకెళ్లడం సాధ్యమా? చిన్నదైతే కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడని అర్థం కావటం లేదా? అలాంటి సందేహాలు రామోజీకి రావా? 

 నిందితుడిపై పోలీసు కేసులేవీ లేవంటూ పోలీసులకు, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి డిక్లరేషన్‌ ఇచ్చి మరీ శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకున్న హర్షవర్దన్‌ చౌదరి టీడీపీ నాయకుడు కాదా? 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించలేదా? అన్ని అబద్ధాలు చెప్పి శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చి ంది? 

 ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌కు వచ్చే ఉద్యోగులంతా బయోమెట్రిక్‌ హాజరు వాడుతూ ఉంటారు. శ్రీనివాసరావు తమ దగ్గర ఉద్యోగం చేస్తున్నారనేది ఫ్యూజన్‌ ఫుడ్స్‌ చెప్పినదే. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఫ్యూజన్‌ ఫుడ్స్‌ ఇచ్చి నవే. కానీ బయోమెట్రిక్‌ హాజరులో ఎన్నడూ శ్రీనివాసరావు వేలిముద్రలు రికార్డు కాలేదని దాన్ని విశ్లేషించిన వర్గాలు చెబుతున్న మాట. ఇదంతా కుట్ర అనటానికి ఇది కూడా ఒక సాక్ష్యాధారమే కదా? 

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విశాఖపట్నంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ విశాఖ ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. ‘‘ప్రతి శుక్రవారం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరయ్యేవారు. దానికోసం ఆయన విశాఖ ఎయిర్‌పోర్టుకు రావటం... హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయంలో దిగటం చేసేవారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు పథకం ప్రకారం ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారు’’ అని ఎన్‌ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇదంతా తెలుసుకున్నాకే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారనే అనుమానాలున్నాయి. మరి ఇలా సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసే అవకాశం ప్రతిపక్షంలో ఉండే జగన్‌మోహన్‌ రెడ్డికి ఉంటుందా? అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఉంటుందా? 

 నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభిమాని అయితే... ఆయనకు తెలుగుదేశం నేత హర్షవర్దన్‌ చౌదరి ఉద్యోగమెందుకు ఇస్తాడు? అది కూడా ఎయిర్‌ పోర్టు పోలీసులకు తప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చి మరీ!!. కుట్ర కోణంలో ఇదే అసలు కోణం కదా? 

లోతైన దర్యాప్తు అవసరం... 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికీ అడుగుతున్నదొక్కటే. హత్యాయత్నం జరిగిందని ఇప్పటికే ఎన్‌ఐఏ తే ల్చి... చార్జిషీట్లో కూడా దాన్ని ధ్రువీకరించింది. అయితే ఈ హత్యాయత్నం వెనక ఉన్నదెవరు? దానికి సహకరించింది ఎవరు? కుట్ర ఎవరిది? ఇవన్నీ తేలాలని, దీనికోసం దర్యాప్తునువేగవంతం చేసి... పూర్తి స్థాయి చార్జిషీటును వెయ్యాలని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరుతున్నారు.

ఇదే అభ్యర్థనతో ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణలో భాగంగానే ఎన్‌ఐఏకు కోర్టు నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానంగా కౌంటర్‌ వేసిన ఎన్‌ఐఏ.. దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నామనే చెప్పింది తప్ప ముగించినట్లు పేర్కొనలేదు. కానీ ముగించేసినట్లుగా... కుట్ర కోణం లేదని తేల్చేసినట్లుగా ‘ఈనాడు’ దివాలాకోరు రాతలు రాస్తుండటమే అసలైన దుర్మార్గం.    

మరిన్ని వార్తలు