పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి దౌర్జన్యం

31 Jan, 2024 04:33 IST|Sakshi

మైనింగ్‌ సిబ్బందిపై ‘ఏలూరి’ అనుచరుల దాడి

విచక్షణారహితంగా కొట్టి గదిలోబంధించిన వైనం

అధికారులను దుర్భాషలాడిన ఎమ్మెల్యే

సాక్షి ప్రతినిధి, బాపట్ల/మార్టూరు: నోవా అగ్రిటెక్‌ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం  మార్టూరులో గ్రానైట్‌ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులపై తన అనుచరులతో పాటు ఏకంగా దాడికి పాల్పడ్డారు. గ్రానైట్‌ పరిశ్రమల్లో తనిఖీలు చేయనిచ్చేది లేదంటూ తొలుత అధికారులను అడ్డగించారు. తనిఖీకి వచ్చిన మైనింగ్‌ ఏడీతోపాటు మిగిలిన అధికారులనూ దుర్భాషలాడారు.

మైనింగ్‌ అధికారులతో వచ్చిన డ్రైవర్‌  శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. గౌరవప్రదమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి పరిశ్రమలను తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులపై బరితెగించి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారు. విచారణ జరిగితే అక్రమాలు వెలుగుచూస్తాయన్నా భయంతోనే ఏలూరి దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.  వివరాల్లోకి వెళితే మార్టూరు గ్రానైట్‌ పరిశ్రమల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో నెల్లూరు మైనింగ్‌ విజిలెన్స్‌ ఏడీ బాలాజీనాయక్, మచిలీపట్నం మైనింగ్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం తనిఖీల నిమిత్తం మార్టూరుకు వచ్చారు.

బాలాజీనాయక్‌ బృందం బల్లికురవ మండలం వేమవర వద్ద ఉన్న ఎమ్మెల్యే ఏలూరి అనుచరుడు కోటపాటి సురేష్‌కు చెందిన రెండు ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించగా మచిలీపట్నం ఏడీ ప్రతాప్‌రెడ్డి మార్టూరులోని ఏలూరి మరో అనుచరుడు కామినేని జనార్దన్‌కు చెందిన ఫ్యాక్టరీలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని మార్టూరులోనే ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు  తెలియజేయడంతో అనుచరులతో సహా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏడీ ప్రతాప్‌రెడ్డిని ఎలా తనిఖీలు చేస్తారంటూ నిలదీశారు.

తనిఖీలు చేస్తామంటే చూస్తూ ఉరుకునేది లేదంటూ గొడవకు దిగాడు. అనుచరులతో కలిసి అధికారులను దుర్భాషలాడారు. వారిపై  జులుం ప్రదర్శించారు. ఏడీ  ప్రతాప్‌రెడ్డిపై జరుగుతున్న దౌర్జన్యం చూసి అడ్డుకోబోయిన డ్రైవర్‌ శ్రీనివాసరావుపై ఏలూరి అనుచరులు దాడికి దిగారు. అతనిని ఇష్టానుసారం కొట్టారు. ఫ్యాక్టరీ ఆవరణలోని ఓ గదిలో బంధించారు. 

ఎమ్మెల్యే, అనుచరులపై కేసులు నమోదు
 ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి సీఐ నరసింహారావు మంగళవారం రాత్రి తెలిపారు. ఏలూరి సాంబశివరావు, ప్రత్తిపాటి సురేష్, చల్లగుండ్ల కృష్ణ, దివ్య ప్రసాద్, షేక్‌ అబ్దుల్‌ రజాక్, మిన్నెకంటి రవి, అడుసుమల్లి శ్రీనివాసరావు, నడింపల్లి హనుమాన్‌ ప్రసాద్, మరికొందరిపై మైనింగ్‌ ఏడీ ఆర్‌ ప్రతాప్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. వీరిపై ఐపీసీ 341, 353, 323, 324, 427, 386, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు