కులగణనతో భావితరాలకు మరింత మేలు

21 Nov, 2023 05:12 IST|Sakshi

బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణు

సాక్షి, అమరావతి/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న సమగ్ర కుల గణన చరిత్రాత్మకమని, గొప్ప మనస్సుతో ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొని­యా­డారు. ఏపీలో కుల గణన–2023పై ఆయా వర్గాల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వం రాష్ట్రం­లోని ఐదు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వ­హిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో ప్రాంతీయ సమావేశాలు జరి­గాయి. సోమవారం విశాఖ, విజయవాడలో నిర్వహించారు.

ఈ నెల 24న తిరుపతిలో నిర్వహి­స్తారు. విజయవాడ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా­లకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఏడాది కిందట సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసి చూపిస్తున్నారని, ప్రతిపక్షాలు దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు.

ఇది సామా­జిక కోణంలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 723 కులాల సమగ్ర లెక్కలు తేల్చేందుకు కుల గణన ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. కుల గణనతో అందరి తలరాతలు మారతాయని, భావితరాలకు మరింత మేలు జరుగుతుందని మంత్రి వేణు వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.   

బడుగుల కోసం పుట్టిన కారణ జన్ముడు సీఎం జగన్‌ 
కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ కుల గణన ప్రక్రియ పూర్తయితే జనాభా శాతం ప్రకారం అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏపీ ఎస్సీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ మారు­మూడి విక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే ఆలోచనా విధానంతో సీఎం జగన్‌ అట్ట­డుగు వర్గాలకు మేలు చేస్తున్నారని, రిజర్వేషన్‌లతో నిమిత్తం లేకుండా నామినేటెడ్‌ నుంచి కేబినేట్‌ పదవుల వరకు అట్టడుగు వర్గాలకు అగ్ర­­పీఠం వేస్తున్నారని కొనియాడారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ కుల గణన పూర్తయితే అనేక సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ 92 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కుల గణన సామాజిక మార్పులకు నాంది పలుకుతూ అరుదైన రికార్డు సృష్టిస్తుందన్నారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేష­గిరి మాట్లాడుతూ కుల గణన ప్రక్రియలో కుల సంçఘాల పెద్దలను, ప్రతినిధులను భాగస్వా­మ్యం చేసి నూరు శాతం విజయవంతమయ్యేలా చూడాలన్నారు.

ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ఆయా కుల నాయకులను కూడా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళ­రావు మాట్లాడుతూ కుల గణన జాబితాలను స్థానిక సచివాలయాల వద్ద ప్రదర్శనకు పెట్టి అభ్య­­ంతరాలను కూడా స్వీకరించాలని చెప్పారు.

సమాచార గోప్యతకు అధిక ప్రాధాన్యం
విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర కుల గణన ప్రాంతీయ సదస్సులో జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ కులగణన సర్వే కారణంగా పాత కుల ధ్రువీకరణ పత్రాల నిలుపుదల గానీ, సంక్షేమ పథకాల నిలుపుదలగానీ జరగ­ద­న్నారు. యాప్‌ ద్వారా నిర్వహించే ఈ సర్వేలో సమాచార గోప్యతకు అధిక ప్రాధా­న్యం ఇస్తున్నట్టు తెలి­పారు. ఈబీసీ కార్పొరేషన్‌ అదనపు ఎండీ మల్లికార్జునరావు మాట్లాడుతూ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

1931 తర్వాత కుల గణన చేపట్టాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని పలు కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు కొనియాడారు. ఉప కులాలకు కూడా వేర్వేరుగా గణన చేపట్టా­లని పలు కుల సంఘాల ప్రతినిధులు సూచి­ం­చారు. కుల గణన సమయంలో ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని, అలాగే స్కూల్స్‌ నుంచి పొందిన పత్రా­లను సమర్పించాలని.. లేకుంటే కొంత మంది స్వార్థంతో తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ఎస్టీ కులంలో చాలా మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారని.. ముఖ్యంగా ఒడిశా నుంచి వచ్చిన వారు ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని పలువురు ఎస్టీ కులాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు జాన్‌ వెస్లీ, సూరిబాబు,  పిల్లా సుజాత, సుజాత,  రమాదేవి, అమ్మాజీ,  మధుసూదనరావు, అనూష, అప్పలకొండ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు