‘ఒంగోలు’ జాతి పరిరక్షణకు గుర్తింపు 

16 Dec, 2023 06:03 IST|Sakshi

గుంటూరు లాంలోని పశుపరిశోధన స్థానానికి బ్రీడ్‌ కన్జర్వేషన్‌ అవార్డు–2023 

ప్రకటించిన ఐసీఏఆర్‌–ఎన్‌బీఏజీఆర్‌

ఈ నెల 23న కర్నల్‌లో ప్రదానం  

గతేడాది పుంగనూరు పరిశోధన కేంద్రానికి దక్కిన అవార్డు 

సాక్షి, అమరావతి: అరుదైన, అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో కృషిచేస్తున్న శ్రీవేంకటేశ్వర పశువైద్య  విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశుపరిశోధన స్థానాన్ని బ్రీడ్‌ కన్జర్వేషన్‌ అవార్డు–2023 వరించింది. జాతీయస్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషిచేసే పరిశోధన సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది.

గతేడాది పుంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తున్న పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ఈ ఏడాది ఒంగోలు జాతి పరిరక్షణకు కృషిచేస్తున్న పరిశోధన స్థానానికి ప్రతిష్టాత్మకమైన బ్రీడ్‌ కన్జర్వేషన్‌ అవార్డును ప్రకటించారు. కిసాన్‌ దివస్‌ సందర్భంగా ఈ నెల 23న హరియాణలోని కర్నల్‌ళక్ష జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రం, నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు

ఒంగోలు జాతికి శతాబ్దాల చరిత్ర
ఒంగోలు జాతి పశువుల స్వస్థలం ఒకప్పటి ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట తాలూకాలైనప్పటికీ వీటి పుట్టినిల్లు దక్షిణాన పెన్నా, ఉత్తరాన కృష్ణానదుల మధ్యకు వ్యాపించింది. 1900 దశకంలో ప్రతి రైతు దగ్గర నాలుగు నుంచి ఎనిమిది ఒంగోలు ఆవులుండేవి. కానీ క్రమేపీ ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరాయి.  మంచి పాలసార కలిగిన జాతిగా ఇవి అంతర్జాతీయ ఖ్యాతి గడించా­యి.

ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి, వ్యా­«ధినిరోధక శక్తి కలిగి ఉండడంతో పాటు భారీ శరీ­రంతో ఆకర్షణీయంగా ఉండడంతో ఒంగోలు జాతి­పశువులు విదేశీయులను విశేషంగా ఆకర్షించాయి. ఫలితంగా తొలుత 1875లో బ్రెజిల్, 1885లో అమెరికా వీటిని తమ దేశానికి తీసుకెళ్లా­యి. క్రమంగా ఒంగోలు జాతి అక్కడి నుంచి లా­టిన్‌ అమెరికా దేశాలకు విస్తరించింది. బ్రెజిల్‌లో ఒంగోలు జాతిని నెలోర్, సంబా ఒంగోలు జాతిగా పిలుస్తారు. మన ఒంగోలు, గిర్, కాంక్రెజ్‌ జాతుల కలయికతో ఇండుబ్రెజిల్‌ జాతిని అభివృద్ధి చేశారు. అలాగే జమైకాలో ఒంగోలు జాతి ద్వారా బ్రాహ్మన్, వెనెజ్యులాలో ప్రిడియన్, ఒంగోలు జాతుల కలయికతో ఒంక్యాంపో అనే కొత్తజాతిని అభివృద్ధి చేశారు.   

ఐవీఎఫ్‌ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధి 
2019లో ‘ఐవీఎఫ్‌–ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ (ఐవీఎఫ్‌అండ్‌ఈటీ) ద్వారా మేలు జాతి ఆవుల అభివృద్ధి ప«థకానికి రూ.2.39 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ జన్యు లక్షణాలు, మంచి పాలసార గలిగిన దేశీ ఆవుల సంతతిని అభివృద్ది చేయుడం ఈ ప్రా­జెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యుత్తమమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా మేలు జాతి ఒంగోలు, పుంగనూరు జాతి పిండాలు ఉత్పత్తి చేసి తద్వారా ఆ జాతుల పరిరక్షణకు  కృషిచేస్తున్నారు. ప్రస్తుతం 450 దేశీ­య మేలుజాతి ఒంగోలు పశుసంపద కలిగిన లాం పశుపరిశోధన స్థానం ఒంగోలు జాతి ప్రత్యుత్పత్తి, జీవ సాంకేతికతలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’గా ఉంది. 

అవార్డుతో మరింత బాధ్యత 
ఒంగోలు జాతి పరిరక్షణ కోసం దశాబ్దాలుగా కృషిచేస్తున్నప్పటికీ.. నాలుగున్నరేళ్లుగా ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధితో విశేష గుర్తింపు లభించింది.

గుంటూరు పశుపరిశోధన స్థానాం ద్వారా చేస్తున్న నిర్విరామ కృషికి గుర్తింపుగా హరియాణలోని కర్నల్‌లోగల ఐసీఏఆర్‌–నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనిటిక్‌ రిసోర్సస్‌ (ఐసీఏఆర్‌ అండ్‌ ఎన్‌బీఏజీఆర్‌) నుంచి ‘జాతి పరిరక్షణ అవార్డు–2023’ లభించింది. ఈ అవార్డు ద్వారా ఒంగోలు జాతి పరిరక్షణ, అభివృద్ధి కోసం మరిన్ని పరిశోధనలు చేసేందుకు యూనివర్సిటీకి మరింత తోడ్పాటు లభించనుంది. – ప్రొఫెసర్‌ సర్జన్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఒంగోలు జాతి పశుసంతతి
మన దేశంలో వీటిసంఖ్య క్రమేపి తగ్గి అంతరించిపోతున్న వాటి జాబితాలో చేరడంతో ఒంగోలు జాతి గోవుల అభివృద్దికి శ్రీకారం చుట్టారు. 1926లో ఏర్పాటైన గుంటూరు లాంలోని పరిశోధన స్థానం 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తోంది. వంద మేలు జాతి ఒంగోలు ఆబోతుల నుంచి దాదాపు 11 లక్షల వీర్య మోతాదులు తయారు చేసి తెలుగు రాష్ట్రాల రైతులకు అందజేశారు.

ఫలితంగా రాష్ట్రంలో ఈ జాతి పశుసంపద అభివృద్ధి చెందింది. దేశంలో సుమారు ఏడులక్షల ఒంగోలు గోసంతతి ఉండగా, ఒక్క ఏపీలోనే నాలుగు లక్షలకుపైగా వీటి సంఖ్య పెరిగింది. ఇటీవల మేఘాలయ రాష్ట్ర సంవర్ధకశాఖకు ఒంగోలు జాతి వీర్యంతో పాటు కోడెదూడలను సరఫరా చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణ కోసం వివిధ ప్రాజెక్టుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు శ్రీవేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం నిర్విరామ కృషిచేస్తోంది.

>
మరిన్ని వార్తలు