పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభానికి 12న సీఎం జగన్‌ 

30 Nov, 2023 05:31 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు

మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడి

కాశీబుగ్గ: పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభించేందుకు డిసెంబర్‌ 12న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలాస రానున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను బుధవారం ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి సందర్శించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వాల హయాంలో ప్రజాసంఘాలు, వామపక్షాలతో కలిసి కిడ్నీ బాధితుల పక్షాన గళం వినిపించామని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్‌ కేంద్రాలు కార్యరూపం దాల్చాయని చెప్పారు. రూ.700 కోట్లతో మంచినీటి పథకం సైతం నిర్మించినట్టు తెలిపారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం జగన్‌ డిసెంబర్‌ 12న పలాస వస్తున్నారని చెప్పారు.  


అన్నిరకాల వైద్యసేవలూ పొందేలా..
పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ ఆస్పత్రి కేవలం కిడ్నీ వ్యాధిగ్రస్తులకేననే అపోహ ఉందని మంత్రి అప్పలరాజు అన్నారు. కానీ.. ఇక్కడ జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జన్, న్యూరాలజీ, పల్మనాలజీ, ఆడియోగ్రఫీ, ఐసీయూ వంటి అత్యవసర వైద్యసేవలు 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అత్యవసర వైద్యం అవసరమున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందవచ్చన్నారు.

డయాలసిస్‌ యూనిట్‌లో 40 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు షిఫ్ట్‌లలో రోజుకు 120 నుంచి 200 మందికి రోజుకు డయాలసిస్‌ చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఆయన వెంట మహేంద్ర రైతు కూలీ సంఘం, ఉద్దాన రైతు కూలీ సంఘం, జీడి రైతు సంఘం, యూటీఎఫ్, యూవీవీ సేవా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, పలాస యూత్‌ అసోసియేషన్, శ్రీవివేకానంద సేవాసమితి, గ్రీన్‌ ఆర్మీ అసోసియేషన్, సీపీఐ ప్రతినిధులు ఉన్నారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు