అన్ని రంగాల్లో మహిళలకు సీఎం జగన్‌ ప్రాధాన్యత

31 May, 2021 04:35 IST|Sakshi

సీఎం జగన్‌ 94.5 శాతం హామీలు నెరవేర్చారు 

ప్రజా సంక్షేమంలో భాగమైనందుకు మా జన్మ కూడా ధన్యమైంది

రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత కల్పించి పెద్ద పీట వేశారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మంత్రివర్గంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు సీఎం కల్పించారని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆడపిల్లల డ్రాపవుట్లు తగ్గించిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. మహిళలే మహరాణులు అని గుర్తిస్తూ, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ వాహనమిత్ర, వైఎస్సార్‌ లా నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా తదితర పథకాల ద్వారా ప్రత్యక్షంగా రూ.56,875 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు. పరోక్షంగా జగనన్న గోరుముద్ద వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ జగనన్న లేఅవుట్లు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యాకానుక పథకాల ద్వారా రూ. 31,164 కోట్లు మహిళల ఖాతాల్లో జమ అయిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం మహిళల ఖాతాల్లో రూ.88 వేల కోట్లకు పైచిలుకు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలో రాజన్న పాలన మళ్లీ వచ్చిందని ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. 

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన
నాడు డాక్టర్‌ వైఎస్సార్‌ సంక్షేమంపై ఏ విధంగా ప్రధానంగా దృష్టి పెట్టారో మళ్లీ అదే తరహాలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్‌ పరిపాలన సాగిస్తున్నారని సుచరిత చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఒక మెడికల్‌ కళాశాల చొప్పున 16 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటలకు ఆర్బీకే ద్వారా గిట్టుబాటు ధరలు కల్పించేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించారని తెలిపారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌ అగ్రతాంబూలం అందించారని సుచరిత అన్నారు. రెండేళ్ల సీఎం జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పాలన ఎలా ఉందో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఓ చిన్న ఉదాహరణగా తీసుకుంటే యాదార్థం అర్థం అవుతుందని చెప్పారు. ఆ కుటుంబానికి అందిన వివిధ సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయన్నారు. వివిధ పథకాల ద్వారా ఒక్క మహిళకే రూ.11 లక్షల మేర లబ్ధి చేకూరిందన్నారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ, వర్గాలకు, మహిళలకు అండగా నిలబడిన సీఎం జగన్‌ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, సువర్ణ పాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

సీఎం జగన్‌ తమకు అండగా నిలిచారని మహిళలు భావిస్తున్నారు. ఇటువంటి మంచి పాలనలో భాగస్వామ్యమైనందుకు మా జన్మ కూడా ధన్యమైందని చెప్పారు. ప్రజలను ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగానే టీడీపీ చూసిందన్నారు. చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి, వాటిల్లో ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వంచించారన్నారు. అదే సీఎం మేనిఫెస్టోలో ఇచ్చిన 94.5 శాతం హామీలను కేవలం రెండేళ్లోనే అమలు చేశారని తెలిపారు. సీఎం జగన్‌ ప్రభుత్వానికి అటు ప్రజలు, ఇటు దేవుని సహకారం ఉందన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు