నిర్ణీత ఫీజుతోనే కోవిడ్‌ చికిత్స

26 Aug, 2020 04:00 IST|Sakshi

ప్రభుత్వం నిర్ధారించిన ధరకు వైద్యం అందించని ఆస్పత్రులపై కఠిన చర్యలు  

కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆస్పత్రుల్లో భద్రతా నియమాలు పాటిస్తున్నారా? లేదా? చూడాలి

భద్రతా ప్రమాణాలు పాటించక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూస్తున్నాం.. అలాంటివి జరక్కుండా చర్యలు తీసుకోవాలి 

కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి

పేషెంట్‌కు అరగంటలో కచ్చితంగా బెడ్‌ కేటాయించాలి 

దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేసి రికార్డు నెలకొల్పాం

సాక్షి, అమరావతి: కొన్ని ఆసుపత్రుల్లో కోవిడ్‌ చికిత్సకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, ఆలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీవో)లో పేర్కొన్న దాని కంటే.. ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయని, దీనిపై కలెక్టర్లు, పోలీసులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చిన సమయంలో మానవత్వం చూపించాలన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నివారణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించాలి
► మండల స్థాయిలో 3 నుంచి 5 మందితో ఓ కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ద్వారా కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రతా నియమాలు పాటిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాలి. 
► అగ్ని ప్రమాదాలను నిరోధించే సిలెండర్లు ఉన్నాయా? లేదా? చూడండి. లేకపోతే అవి ఏర్పాటు చేశాకే ఆస్పత్రులను తెరవమని చెప్పండి. భద్రతా ప్రమాణాలు లేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూస్తున్నాం. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి.
► కోవిడ్‌ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు చేపట్టింది. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేసి రికార్డు నెలకొల్పాం. కోవిడ్‌ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించగలిగితే, చిన్న చిన్న మందులతోనే ఇంట్లోనే కోలుకునే అవకాశం ఉంటుంది. 
► పరీక్షలు ఉధృతంగా కొనసాగాలి. 24 గంటల్లోగా ఫలితాలు వచ్చేలా చూడండి. కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. బాధితులు వేచి చూసే పరిస్థితులు లేకుండా అరగంటలో బెడ్‌ ఇవ్వాలి. 

హెల్ప్‌ డెస్క్‌లు కీలకంగా వ్యవహరించాలి
► 104, 14410 సహా వివిధ కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్‌ కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఆస్పత్రుల్లో ఉన్న హెల్ప్‌ డెస్క్‌లు కళ్లు, చెవులుగా కలెక్టర్లు భావించాలి. అవి బాగా పని చేసేలా చూడాలి. 
► కోవిడ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది, ఆహారం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్‌ లైన్లు, మందులు తదితర అంశాలు సరిగ్గా ఉన్నాయా? లేవా? అన్నది చూడండి. వీటి ఆధారంగా ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వండి.  
► సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కోవిడ్‌ ఆస్పత్రులను పర్యవేక్షించాలి. సేవల్లో నాణ్యత ముఖ్యం. వార్డుల్లో కార్యకలాపాలను సీసీ కెమెరాలతో మానిటర్‌ చేయాలి. కోవిడ్‌ వచ్చిందని భావిస్తే.. ఏం చేయాలి? ఎవరికి కాల్‌ చేయాలి? అన్నదానిపై అవగాహన లేని మనిషి రాష్ట్రంలో ఉండకూడదు. హోర్డింగ్స్‌ పెట్టాలి. కోవిడ్‌ కోసం తాత్కాలికంగా డాక్టర్లు, నర్సుల నియామకాలపై దృష్టి పెట్టాలి. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండాలి. 

ఆరోగ్యశ్రీ పేషెంట్‌ వస్తే.. మానవత్వంతో డీల్‌ చేయాలి
► మన దగ్గర పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఇలా వివిధ స్థాయిల్లో ఆస్పత్రులు ఉన్నాయి. ప్రతి చోటా హెల్ప్‌ డెస్క్‌లను పెట్టి, అందులో ఆరోగ్య మిత్రలను కూర్చోబెట్టండి. ఆరోగ్య శ్రీ పేషెంట్‌ వస్తే మానవత్వంతో డీల్‌ చేయాలి. 
► వచ్చిన పేషెంట్‌కు వైద్యం చేసే పరిస్థితి అక్కడ లేకపోతే.. అంబులెన్స్‌ ఏర్పాటు చేసి, సేవలు అందే చోటుకు పంపించాలి. ఆరోగ్య ఆసరా పథకం కూడా బలంగా అమలు కావాలి. జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. 
► ఈ కార్యక్రమంలో డిప్యుటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు