కుంబ్లేతో మా పని సులువవుతుంది

26 Aug, 2020 04:01 IST|Sakshi

దుబాయ్‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కోచ్‌గా భారత దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఉండటం తమ అదృష్టమని కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ వ్యాఖ్యానించాడు. ఆయన వ్యూహాలను మైదానంలో సరిగ్గా అమలు చేయగలిగితే చాలని అతను అన్నాడు. ‘ఈ సీజన్‌లో అనిల్‌ భాయ్‌ మాతో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఒకే నగరం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి మైదానంలోనూ, మైదానం బయటా ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనిల్‌ భాయ్‌ కోచ్‌గా ఉండటం వల్ల కెప్టెన్‌గా నా పని సులువవుతుంది. జట్టు ప్రణాళికలు ఆయనే రూపొందిస్తారు. వాటిని అమలు చేయడమే మా బాధ్యత’ అని రాహుల్‌ వివరించాడు.  

వారిద్దరు చెలరేగితే...
పంజాబ్‌ జట్టులో గేల్, మ్యాక్స్‌వెల్‌ రూపంలో ఇద్దరు విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. గత రెండు ఐపీఎల్‌లలో రాహుల్‌ కూడా అద్భుతంగా రాణించాడు. వీరందరి కాంబినేషన్‌తో కింగ్స్‌ ఎలెవన్‌ చెలరేగగలదని కెప్టెన్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మ్యాక్స్‌వెల్‌ గతంలోనూ పంజాబ్‌ తరఫున ఆడి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అందుకే వేలంలో కూడా అతను కావాలని గట్టిగా కోరుకున్నాం. తనదైన రోజున అతను ఏ బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలడు. గత రెండు సీజన్లలో మా జట్టు మిడిలార్డర్‌లో అలాంటి బ్యాట్స్‌మన్‌ లేని లోటు కనిపించింది. గేల్‌తో కూడా చాలా ఏళ్లు కలిసి ఆడాను. మా జట్టులో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. అతను మా ప్రధాన బృందంలో కీలక భాగం. అతని అనుభవంతో మా కోసం మ్యాచ్‌లు గెలిపించగలడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఎన్నో విధాలా ప్రత్యేకమైంది. నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని రాహుల్‌ విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా