రానున్నది కురుక్షేత్రం.. మీ బిడ్డకు అండగా ఉండండి

25 May, 2023 04:24 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన సభకు హాజరైన విద్యార్థులు, అశేష జన సందోహంలో ఓ భాగం , విద్యార్థిని దివ్యను ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

జగనన్న విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

మీరు పెద్ద చదువులు చదవండి.. ఫీజు ఎంతైనా మేం చెల్లిస్తాం 

విద్యార్థులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌  

ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్షాలు ఈ విషయం గ్రహించాలి  

ఈ నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.3 లక్షల కోట్లు లబ్ధి 

రాష్ట్ర అప్పుల గ్రోత్‌ రేట్‌ గతంలో కంటే ఇప్పుడే తక్కువ  

అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్‌.. అప్పుడెందుకు ఈ పథకాల్లేవ్‌? 

గతంలో ఏ ముఖ్యమంత్రీ పేదల గురించి ఇంతగా ఆలోచించ లేదు   

మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే నాకు మద్దతు ఇవ్వండి  

నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా గట్టిగా నిలబడాలంటే వారి పట్ల ఉన్న వివక్ష సంకెళ్లు తెంచుకోవాలి. అందుకు చదువు ఒక్కటే మార్గమని అంబేడ్కర్, సావిత్రీబాయి పూలే, అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి గొప్పవాళ్లు చెప్పారు. అందుకే మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా నాలుగేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను.    
– సీఎం వైఎస్‌ జగన్‌   

కొవ్వూరు నుంచి సాక్షి ప్రతినిధి: ‘పేదల తల రాత మార్చేందుకు ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా పేదల బాగు కోసం మనందరి ప్రభుత్వం ఎంతగానో పరితపిస్తూ అడుగులు ముందుకు వేస్తోంటే గత పాలకులు రాష్ట్రం దివాలా తీస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. వారంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి తోడేళ్ల గుంపు మాదిరిగా మీ బిడ్డపైకి వస్తున్నారు.

పేదల ప్రతినిధిగా ఉన్న నాపైకి ఈ పెత్తందారులంతా రాబోయే రోజుల్లో మ­రిన్ని అబద్ధాలు చెబుతూ.. మరింతగా దుష్ప్ర­చారం చేస్తూ వస్తారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. రాబోయే రోజుల్లో వారితో జరిగే కురుక్షేత్ర మహా సంగ్రామంలో మీరంతా మీ బిడ్డకు అండగా నిలవాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సత్యవతినగర్‌లో బుధవారం ‘జగనన్న విద్యా దీవెన’ జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన నిధులను లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదవాడికి ఏం చెయ్యాలి.. పేదరికం పోవాలంటే ఆ పేదవాడిని ఎలా ఆదుకోవాలి.. ఎలా తోడుగా నిలబడాలని గత ప్రభుత్వ పెద్దలు ఏ రోజూ ఆలోచించలేదని చెప్పారు. గతంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. అంతా ఒక గజ దొంగల ముఠాగా ఏర్పడ్డారన్నారు. వాళ్ల రాజకీయం, వాళ్ల ఆలోచన అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం అన్నట్టుగా సాగిందని తెలిపారు.

‘అందుకే దీని గురించి ఏ పేపర్‌లో రాయరు.. ఏ టీవీలో డిబేట్‌లు పెట్టరు.. ప్రశ్నిస్తాను అన్న ఏ ఒక్కరూ ప్రశ్నించరు.. కాలేజ్‌లో చదువుతున్న పిల్లలపై చేస్తోన్న ఖర్చుతో రాష్ట్రం దివాలా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిని, చెడిపోయిన మీడియా వ్యవస్థను చూస్తున్నాం’ అని అన్నారు. పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలని, ఫీజు ఎంతైనా ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇ­చ్చా­రు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఇంగిత జ్ఞానం లేని కొందరికి చదువు విలువ తెలియదు 
► భావితరాల తలరాతలు మార్చేలా విద్యార్థులపై హ్యూమన్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఖర్చు చే­స్తున్నాం. ఈ హ్యూమన్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ రాష్ట్రం, దేశం.. దశ, దిశ మారుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి మంచి ఇంజినీర్‌గా, డాక్టర్‌­గా బయటకు వస్తే భావితరాలకు స్కిల్డ్‌ మేన్‌ ప­వర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది.  

► దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విప్లవాత్మక మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకువచ్చాం. ప్రభుత్వ బడి మారింది. చదువులు మారుతున్నాయి. ఇంగ్లిష్‌ మీడియం వచ్చింది. సీబీఎస్‌ఈ సిలబస్‌ కూడా వచ్చింది. బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ కూడా తీసుకువచ్చాం. దీని ద్వారా తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో విద్యను అభ్యసించే అవకాశం లభించింది. పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. 

► గత ప్రభుత్వం సంవత్సరానికి కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వంలో ఈ ఒక్క ప«థకానికి దాదాపు రూ.2 వేలు కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలకు యూనిఫాం నుంచి బుక్స్‌ వరకు ఎప్పుడు పాఠశాలలు తెరిచినా వారికి అందేట్టుగా విద్యాకానుక అందిస్తున్న ప్రభుత్వం మనదే. చదువుల విప్లవమే తీసుకువచ్చాం. 

► పేదరికం సంకెళ్లు నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే పాశుపతాస్త్రం. మీ ఇంటిలో అందరినీ చదివించండి. మీ వెంట నేనుంటా. వివక్ష పోవాలంటే ఉన్నత చదువులతోనే సాధ్యమవుతుంది. విద్యపై పెట్టేది హ్యూమన్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే విషయం ఇంగిత జ్ఞానం లేని కొందరు ప్రతిపక్ష నేతలకు తెలియడం లేదు.  

ఇది క్లాస్‌ వార్‌ 
► గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా. ఈ నాలుగేళ్లలో జరిగిన మంచిని జీర్ణించుకోలేని  వారందరూ కలిసి కట్టుగా ఒక్క జగన్‌ను ఎదుర్కోవడానికి వస్తామంటున్నారు. మీ జగన్‌కు వాళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి మద్దతు ఉండకపోవచ్చు.  

► ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌ జరుగుతోంది. పేద వాళ్లంతా ఒక వైపు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారు. మనందరి ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా సైనికులుగా నిలబడండి. నా బలం, నా నమ్మకం మీరే. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలనే నమ్ముకున్నా.  

ప్రతి కుటుంబం నుంచి సత్య నాదెళ్ల రావాలి  
► మన రాష్ట్రంలో ప్రతి కుంటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడుతున్నా. స్టాన్‌ఫోర్డ్, 
ఆక్స్‌ఫర్డ్‌లో సీటు వచ్చినా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు.. ప్రతిభ మీరు చూపించండి, మీ ప్రతిభకు తోడుగా మీ జగనన్న ఉంటాడని మళ్లీ చెబుతున్నా.   

► షాదీ తోఫా, కళ్యాణమస్తు వంటి çపథకాలకు చదువుతో ముడిపెట్టి ప్రతి ఇంట్లో కూడా పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పిల్లలు బాగా చదవాలని, పేద పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒక్కటే మార్గమని మనసా వాచా కర్మణా నమ్మి వాళ్ల తరఫున మనందరి ప్రభుత్వం చదువుల కోసం ఇంతగా తాపత్రయపడుతోంది. 

విమర్శకులారా ఆలోచించండి 
► ఇంతకు ముందెప్పుడైనా ఇలా బటన్‌లు నొక్కి ఎవరికీ లంచాలు ఇవ్వకుండా, వివక్ష చూపకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి పథకాల లబ్ధి నేరుగా చేర్చే పరిస్థితి ఉందా? మనందరి ప్రభుత్వాన్ని విమర్శించే వారు,  విద్యాదీవెన అందుకుంటున్న ప్రతి తల్లి, ప్రతి విద్యార్థి ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నా. 

► జగనన్న అమ్మ ఒడి దగ్గర మొదలు పెడితే విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత ఇలా ఏ పథకం చూసినా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి ఏ విధంగా వస్తోందో ఆలోచించండి.  

► ఇంతకు ముందు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పుల గ్రోత్‌ రేటు గతం కన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్‌ ఉన్నప్పుడు కేవలం మార్పు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. ఒక్క ముఖ్యమంత్రి మారడంతో ఈ రోజు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.10 లక్షలు కోట్లు నేరుగా (డీబీటీ) వెళ్లింది. దీనికి ఇంటి స్థలాలు.. ఒక్కో స్థలం విలువ రూ.2.50 లక్షలు వేసుకున్నా రూ.75 వేల కోట్లు నాన్‌ డీబీటీ కింద కలుపుకుని మొత్తంగా రూ.3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశాం. ఇదంతా ఈ నాలుగేళ్లలోనే జరిగింది. ఇది గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆలోచించండి.  

పేదల కోసం పుట్టిన రారాజువన్నా.. 
ఇప్పటి వరకు ఎంత ఏడ్చినా మా కన్నీళ్లు ఆగవనుకున్నా. మీ చిరునవ్వుతో ఆ కన్నీళ్లు కాస్తా మాకు ఆనంద భాష్పాలుగా మారాయి. మాలాంటి పేద ప్రజల కోసం పుట్టిన రాజు, రారాజు మీరు. సంక్షేమ బాటసారివి. అధికార పీఠానికి కొత్త భా­ష్యం పలికి ఆదర్శమూర్తిగా నిలిచారన్నా. నా తల్లిదండ్రులు వికలాంగులు. వారికి మేము ఇద్దరం ఆడ పిల్లలం. నాన్న ఆకుకూరలు అమ్ముతుండగా అ­ను­కోకుండా ఆయనకు  పక్షవాతం వచ్చి బాగా నీరసించిపోయాడు.

వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ ఇప్పిస్తూ.. మా కుటుంబా­న్ని ఆదుకుంటున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నా. మీ వల్లే నేను కార్పొరేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. మేము చదువుకున్నప్పటి స్కూళ్లు, ఇప్ప­టి స్కూళ్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నా. మళ్లీ స్కూ­లుకు వెళ్లి చదువుకోవాలనిపిస్తోందన్నా. మాకు అన్న లేని లోటు మీ వల్ల తీరుతోందన్నా. తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు అంటుంటారే.. అది మీరేనన్నా.  
– దివ్య, బీకాం థర్డ్‌ ఇయర్, కొండవీటి డిగ్రీ కళాశాల, గోపాలపురం  

ఉద్యోగావకాశాలు మీ చలవే 
నేను పేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. నా తల్లి గృహిణి, తండ్రి రైతు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.35 వేలు మాత్రమే వచ్చేది. ఈ రోజు నేను చాలా అదృష్టవంతుడిని. నాకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చింది. ఒక సాధారణ నాయకుడిలా మీరు మోసపూరిత హామీలు ఇవ్వలేదు. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. మీరు ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు చాలా ఉపయోగకరం.

దేశంలో నూతన విద్యా విధానం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం మనదే. మన విద్యా విధానంలో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఉండటంతో ఎన్నో ఉద్యోగావకాశాలు పొందుతున్నాము. గతంలో మా కళాశాలలో కేవలం 30 – 40 శాతం మందికి ఉద్యోగావకాశాలు ఉండేవి. మీరు వచ్చాక అది 90 శాతానికి పెరిగింది. మా కాలేజ్‌ నుంచి ఓ విద్యార్థికి రూ.44 లక్షల ప్యాకేజీతో అమేజాన్‌లో ఉద్యోగం లభించిందంటే అది మీరు తీసుకువచ్చిన మార్పే. మీరే శాశ్వత సీఎంగా ఉండాలి.   
– రాపర్ల ప్రసన్నకుమార్, బీటెక్‌ థర్డ్‌ ఇయర్, తాడేపల్లిగూడెం 

ఉప్పొంగిన జన గోదావరి   
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన విద్యా దీవెన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపించారు. సీఎం ప్రత్యేక బస్సులో ఆర్టీసీ బస్టాండ్, అక్కయ్యమ్మ కా­లనీ, ఎన్టీఆర్‌క్రీడా మైదానం మీదుగా సత్య­వతినగర్‌లో సభా ప్రాంగణానికి చేరుకు­న్నారు. రెండు కిలోమీటర్లకు పైగా రోడ్‌షో సాగింది. ఇరువైపులా జనం జైజగన్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు.

సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం.. విద్యార్థులు, వారి తల్లులతో కొద్దిసేపు మాట్లాడారు. వారితో కలిసి గ్రూపు ఫొటో తీయించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది బయటే ఉండిపోయారు. ‘ప్రతిభ మీది.. ఉన్నత విద్య బాధ్యత నాది.. నేను విన్నాను.. నేను ఉన్నా­ను’ అని సీఎం అన్నప్పుడు విద్యార్థుల ఈల­లు, కేకలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది.

కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వరాల జల్లు కురిపించారు. హోం మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు, కొవ్వాడ కెనాల్‌ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్‌ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు