పద్మ పురస్కార గ్రహీతలకు సీఎం జగన్‌ అభినందనలు 

26 Jan, 2021 10:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక పద్మ పురస్కార గ్రహీతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని, పురస్కార గ్రహీతలు ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించి రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చారని సీఎం తన సందేశంలో కొనియాడారు.

వాయులీన వైతాళికుడు ‘అన్నవరపు’ 
శాస్త్రీయ సంగీత కళలో అంతర్జాతీయ గుర్తింపు 
తెనాలి : ఉత్కృష్టమైన సంగీత కళాకారులకు నిలయం కృష్ణాతీరం. వారిలో విజయవాడకు చెందిన ‘నాద సుధార్ణవ’ అన్నవరపు రామస్వామి ప్రసిద్ధులు. వాయులీన విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను స్వీకరించిన ఈ వైతాళికుడికి 97 ఏళ్ల వయసులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. రామస్వామి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర్లోని సోమవరప్పాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, అన్నవరపు పెద్దయ్య. రామస్వామి 1926లో జన్మించారు. సంగీత కుటుంబంలో జన్మించినా యుక్తవయసులో సంగీత సాధనకు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. తొలుత మాగంటి జగన్నాథం చౌదరి దగ్గర రెండేళ్లు వయొలిన్‌ శిక్షణ తీసుకున్నారు. సుశిక్షణ కోసమని 12 ఏళ్ల వయసులో 1942లో విజయవాడ చేరుకున్నారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు అన్నవరపు రామస్వామి సహధ్యాయి. వారాలు చేసుకుంటూ గురుకుల పద్ధతిలో గురువు సుశ్రూష చేసుకుంటూ సంగీతాన్ని అభ్యసించారు.

రామస్వామి ఆకాశవాణిలో 1948 నుంచి 1986 వరకు వయొలినిస్టుగా పనిచేశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లో సంగీత కార్యక్రమాల రూపకల్పన చేశారు. పలు దేశాల్లో పర్యటించి, భారతీయ శాస్త్రీయ సంగీతకళ ఔన్నత్యాన్ని చాటారు.  తెలుగు విశ్వవిద్యాలయం సంగీత విద్యకు సంబంధించిన సలహా సంఘ సభ్యుడిగా, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంగీత విద్య సలహా విభాగ సభ్యుడిగా, ఆకాశవాణి ప్రోగ్రాం కమిటీ సలహా విభాగంలోనూ పనిచేశారు. ఏఐఆర్‌ న్యూఢిల్లీకి చెందిన టాప్‌ గ్రేడింగ్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. వివిధ ప్రతిష్టాత్మక వేదికలపై ‘నాద సుధార్ణవ’, ‘వాయులీన కళాకౌముది’, ‘వాద్యరత్న’, ‘కళాభారతి’... వంటి ఎన్నో బిరుదులతో సత్కారం అందుకున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక మండలి ‘హంస’, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బహూకరించిన రూ.10 లక్షల నగదుతో కూడిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డు ప్రతిష్టాత్మకమైనవి. సంగీత విద్యను ఎందరికో ఉచితంగా నేర్పిస్తూ వచ్చారు.  

పద్యకవితా చక్రవర్తి ‘ఆశావాది’ 
ఆశావాది ప్రకాశరావుకు పద్మశ్రీ పురస్కారం

అనంతపురం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి, అష్టావధాని ఆశావాది ప్రకాశరావును పద్మశ్రీ అవార్డు వరించింది. ప్రాచీన, ఆధునిక కవితా సమ్మేళనంగా కీర్తిగాంచిన ఆశావాది జిల్లాలోని పెనుకొండ వాసులైన పక్కీరప్ప, కుళ్లాయమ్మ దంపతులకు 1944లో జన్మించారు. దళిత నేపథ్యంలో ఎన్నో అవమానాలకు గురైనా గుర్రం జాషువా లాంటి వారి స్ఫూర్తితో ఆయన సాగించిన కవితా ప్రయాణంలో చిరస్మరణీయమైన విజయాలెన్నింటినో నమోదు చేశారు.  చిన్నవయసులోనే నండూరి రామకృష్ణామాచార్యుల ఆశీస్సులందుకున్న ఆశావాది చిరుతప్రాయంలోనే శ్రీశైలంలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌పై ఆశువుగా పద్యం చెప్పి ప్రశంసలు పొందారు.

ఆశావాదిలోని ప్రతిభా పాటవాలను గుర్తించిన రాధాకృష్ణన్‌.. ఎప్పటికైనా తెలుగువారు గర్వించే కవిగా మారతావన్న మాటను అక్షర సత్యం చేస్తూ ఆయన కలం నుంచి తర్వాతి కాలంలో ఎన్నో విలువైన పుస్తకాలు వెలువడ్డాయి. అధ్యాపకుడిగా వేలాదిమంది విద్యార్థులకు ఆయన జీవిత పాఠాలను బోధించారు.   రాష్ట్రవ్యాప్తంగా 170 అవధానాలు చేశారు. ఆణిముత్యాల వంటి 60 గ్రంథాలు రాశారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, కళారత్న పురస్కారంతో పాటు వందల సంఖ్యలో సాహితీ, కళాసంస్థలు ఆయనకు  పురస్కారాలు, సత్కారాలనందించి గౌరవించాయి. జిల్లా పద్య కవిత్వానికి ఆశాకిరణంగా మారిన ఆశావాదికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్‌ శాంతినారాయణ, జనప్రియ కవి ఏలూరు యంగన్న, ఉమర్‌ ఆలీషా సాహితీసమితి ప్రతినిధులు రియాజుద్దీన్, షరీఫ్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

మృదంగ విన్యాసంలో వికసించిన పద్మం 
దండమూడి సుమతికి పురస్కారం.. పులకించిన ‘పశ్చిమ’
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మృదంగ కళాకారిణి దండమూడి సుమతి రామమోహన్‌రావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. తమ జిల్లా కళాకారిణికి ఈ అవార్డు రావడంపై జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఏలూరులో 1950లో జన్మించారు. నిడుమోలు రాఘవయ్య, వెంకటరత్నమ్మల 14 మంది సంతానంలో ఒకరైన ఆమె బాల్యంలో తండ్రి వద్దే మృదంగ శిక్షణ పొందారు. ఆమె భర్త  దండమూడి రామమోహన్‌రావు సైతం మృదంగం విద్వాంసులే.

మృదంగ వాయిద్యానికి సంబంధించి ఆమె అత్యుత్తమ గురువుగా, ఆల్‌ ఇండియా రేడియో టాప్‌ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా ప్రఖ్యాతి గడించారు. దేశ, విదేశాల్లో అనేక సంగీత ఉత్సవాల్లో పాల్గొన్నారు. సుమతిని మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ ఉత్తమ మృదంగ కళాకారిణి అవార్డుతో మూడుసార్లు సత్కరించింది. సుమతి రామమోహన్‌రావు కర్ణాటక వాయిద్య సంగీతానికి చేసిన కృషికి సంగీత నాటక్‌ అకాడమీ అవార్డు అందుకున్నారు.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు