రాష్ట్రాభివృద్ధికి సహకరించండి 

4 Jan, 2022 04:33 IST|Sakshi
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన సీఎం జగన్

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను ఆయన సోమవారం రాత్రి వేర్వేరుగా కలుసుకుని పలు అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందచేశారు. 

నిధులిచ్చి ఆదుకోండి.. 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులు, ప్రత్యేక హోదా, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావించారు.  

విశాఖ అభివృద్ధికి భోగాపురం కీలకం.. 
అనంతరం పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను కలుసుకుని విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం చూపుతున్న ప్రత్యేక చొరవను సీఎం జగన్‌ అభినందించారు. గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. భౌగోళిక  పరిస్థితుల దృష్ట్యా (పక్కనే తూర్పు నౌకాదళ కేంద్రం ఉండడం) విశాఖలో విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేనందున భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎంతో కీలకమన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత వ్యవధి మూడేళ్లలో పూర్తి చేసేలా సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. 
జ్యోతిరాదిత్యను కలిసిన సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి 

నేడు గడ్కరీ, ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ! 
ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అనురాగ్‌ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.    

మరిన్ని వార్తలు