అక్టోబర్‌ 2న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ

8 Sep, 2020 14:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: అక్టోబర్‌ 2(గాంధీ జయంతి) రోజున 35షెడ్యూల్డ్‌ మండలాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సరిహద్దులను గుర్తించడం, సరిహద్దు రాళ్లను వేయడం, లబ్ధిదారులను వారికి కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి పోటోలు తీయడం, రికార్డుల్లో దాన్ని నమోదు చేయడం, వెబ్‌ ల్యాండ్, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ డేటాబేస్‌లో ఈ వివరాలను నమోదు చేయడం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. (అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌)

అదే విధంగా అర్బన్‌ హెల్త్ ‌క్లినిక్స్‌కు స్థలాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. కొత్తగా 16 టీచింగ్‌ ఆసుత్రులను నిర్మించబోతున్నామని తెలిపారు. వచ్చే నెలలో వీటికి టెండర్లు జరుగుతాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం పదకొండు టీచింగ్‌ ఆసుపత్రులు ఉన్నాయని, వాటికి కొత్తగా పదహారు కలిస్తే 27టీచింగ్‌ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

నాడు-నేడు:
నాడు-నేడు స్కూల్స్‌కు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు కిచెన్‌ కూడా జత చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ పది అంశాలకు సంబంధించి అక్టోబర్‌ 5న స్కూల్స్‌ తెరిచే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. నాడు-నేడు పనుల్లో క్వాలిటీపై కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. 1085 టాయిలెట్లపై స్లాబ్‌లు వేయాల్సి ఉందని వాటిని కూడా పూర్తి చేయాలని సూచించారు. 55,607 అంగన్‌ వాడీ కేంద్రాల్లో కూడా నాడు-నేడు కింద వసతుల ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. వాటిని వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ కింద మార్చబోతున్నామని సీఎం వెల్లడించారు. ఈ కేంద్రాల్లో కూడా పది అంశాల్లో అన్ని నాడు-నేడు పనులు చేపడతామని వ్యాఖ్యానించారు.

22979 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని వాటికి నూతన భవనాలను సమకూర్చాలన్నారు. 11,961 చోట్ల అంగన్‌వాడీలకు స్థలం గుర్తించడం జరిగిందని తెలిపారు. 12,018 చోట్ల స్థలం కేటాయించాల్సి ఉందని, కలెక్టర్లు, జేసీలు త్వరగా స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ నెల 30నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రైమరీ స్కూళ్లలో స్థలం అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 1200 నూతన భవనాలు పూర్తయ్యే స్థితిలో ఉన్నాయని చెప్పారు.

ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అ‌న్నారు. మండల స్థాయిలో ఎంత అవసరం, ఎంత లభ్యత ఉంది అనే అంశాలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ నెలలో ఎరువులకు అధిక డిమాండ్‌ ఉంటుందని కలెక్టర్లు దానిపై దృష్టి సారించాలని సీఎం జగన్‌ సూచించారు.

మరిన్ని వార్తలు