నేడు గిరిపుత్రులకు ‘పట్టా’భిషేకం

2 Oct, 2020 08:04 IST|Sakshi
పాచిపెంట మండలం బడ్నాయకవలసలో గిరిజనులు సాగు చేస్తున్న అటవీభూమి

గిరిజనుల బతుకుల్లో వినూత్న వెలుగులు

అటవీ భూములపై సాగు హక్కు పట్టాలు 

ఉన్నత విద్యకోసం కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాల

అత్యాధునిక వైద్య సేవల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

నేడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీఎం జగన్‌ శ్రీకారం  

గిరిపుత్రుల తలరాతలు మారుతున్నాయి. వారి జీవితాల్లో వెలుగు పూలు పూయించేందుకు సర్కారు నడుం బిగించింది. నాడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా వారి కష్టాలు నేరుగా తెలుసుకున్నారు... వారి సమస్యలు కళ్లారా చూశారు... నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వాటిని నెరవేరుస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నా హక్కుకు ఠికానా లేక... కష్టపడినా ఫలితం దక్కుతుందో తెలీక... దినదిన గండంగా గడుపుతున్న వారికి అటవీభూములపై హక్కు కలి్పస్తున్నారు. ఉన్నత విద్యను వారికి చేరువ చేసేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభిస్తున్నారు. అత్యాధునిక వైద్యం ఉచితంగా అందించేందుకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కల సాకారం చేస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో గిరిజనులకు విద్య, వైద్యం, జీవనోపాధి అందించే భారీ ప్రాజెక్టులను గాంధీ జయంతి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒకేసారి ప్రారంభించనున్నారు. తాను పాదయాత్రలో గిరిపుత్రులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఉన్నత విద్యను, ఆధునిక వైద్య సదుపాయాలను అందించనున్నారు. ఎన్నో ఏళ్లుగా అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్న గిరిపుత్రులకు వారు సాగుచేసే అటవీ భూమిపై సాగుహక్కు కల్పిస్తూ పట్టాలను ఇవ్వనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ మూడు కార్యక్రమాలను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. (చదవండి: సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం)

అటవీ భూములపై శాశ్వత హక్కు 
జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు తదితర మూ డు షెడ్యూల్డు ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నాన్‌ షెడ్యూల్డు ప్రాంతంలోని బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న అటవీ భూములపై కూడా స్థానికంగా నివసించే గిరిజనులకు సాగు హక్కు కల్పించే పట్టాలు, ప్రభుత్వ భూముల పై డీకేటీ పట్టాలు పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్‌ డా.ఎం.హరిజవహర్‌ లాల్‌ నేతృత్వంలో ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని షెడ్యూల్డు, నాన్‌ షెడ్యూల్డు ఏరియాలో కలుపుకొని 13,076 గిరిజన కుటుంబాలకు 25,002 ఎకరాల అటవీ భూమిపై అటవీ హక్కుల పత్రాలు అందజేసేందుకు అంతా సిద్ధం చేశారు. మరో 9,945 మంది గిరిజనులకు 15,012 ఎకరాల విస్తీర్ణంపై హక్కులు కలి్పస్తూ డీకేటీ పట్టాలను కూడా అందజేయనున్నారు. మొత్తం జిల్లాలోని 23,021 గిరిజన కుటుంబాలకు 40,015 ఎకరాల భూములపై సాగు హక్కులు కలి్పంచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 

చేరువలో ఉన్నత విద్య 
గిరిజన విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఉన్నత, సాంకేతిక విద్యను వారి ముంగిటనే అందించేందుకు వీలుగా కురుపాంలో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పా టు చేస్తున్నారు. కంప్యూటర్‌ సైన్సు, సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ బ్రాంచిలతో ఈ ఏడాది నుంచే తరగతు లు మొదలయ్యేలా కళాశాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభు త్వం కళాశాలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.153 కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని కురుపాం ఇంజినీరింగ్‌ కళాశాల స్పెషల్‌ ఆఫీసర్, జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ జయసుమ చెప్పారు. ఇంజినీరింగ్‌ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించడంతోపాటు భవనాల నిర్మాణానికి కూడా ఆన్‌ లైన్‌లోనే శంకుస్థాపన చేయనున్నారు. 

ఆధునిక వసతుల వైద్యం 
పార్వతీపురంలో రూ.49.26 కోట్లతో 151 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు స్థల పరిశీలన కూడా చేశారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడంతస్తుల్లో ఈ ఆసుపత్రి భవనాలను నిర్మించనున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆన్‌లైన్‌ ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పార్వతీపుం ఐటీడీఏ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడంతో ఈ ప్రాంత గిరిజనులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మునిసిపల్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ డా.ఎం.హరిజవహర్‌లాల్‌తో పాటు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధం 
అటవీ భూములను డిజిటైజేషన్‌ ద్వారా సర్వే నిర్వహించి లబి్ధదారులకు కేటాయించిన భూములకు హద్దు రాళ్ళు నాటి, అటవీ హక్కుల పాస్‌ పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్, డీకేటీ పట్టాలు పొందిన గిరిజన రైతులకు భూములు సాగుచేసుకొనే నిమిత్తం వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ ద్వారా జీడిమామిడి మొక్కలు, చిరుధాన్యాల విత్తనాలు, పవర్‌ వీలర్స్, స్ప్రేయర్స్, పవర్‌ టిల్లర్స్, సూక్ష్మ ధాతువులు రాయితీద్వారా అందించనున్నారు.
– ఆర్‌.కూర్మనాథ్, ఐటీడీఏ పీఓ

ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది 
మా తాత ముత్తాతల నుంచి ఎంతోమంది అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. కానీ మా భూములపై హక్కులు మాకున్నాయో లేదో తెలిసేది కాదు. ఇంతవరకు కష్టపడి వ్యవసాయం చేసుకోవడమే గాని మా భూముల పై హక్కు ఎలా పొందాలి, మా పేరున పట్టాలు ఎలా తీసుకోవాలో తెలీదు. ఇప్పుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వల్ల ఆ కల నెరవేరుతోంది. మా భూములపై సంపూర్ణ హక్కులు లభిస్తున్నాయి. సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. 
– ఆరిక శ్రీనివాసరావు, టేఖరగండి గ్రామం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా