సింహగిరికి ‘రక్షణ’ కవచం

20 Jun, 2022 17:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సింహగిరికి రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వన్యప్రాణులు, ఔషధ మొక్కల సంరక్షణతో పాటు ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఈ బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టి్టంది. ప్రహరీ నిర్మాణ బాధ్యతలను వీఎంఆర్‌డీఏకు అప్పగించగా.. తొలివిడతలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రూ.3.59 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది.  

ఔషధమొక్కలు, వన్యప్రాణుల సంరక్షణకు ఉపయుక్తం జీవవైవిధ్యానికి, పర్యావరణానికి చిరునామా సింహాచలం కొండలు. తూర్పు కనుమల్లో అత్యంత సుందరమైన, పర్యావరణహితమైన గిరులుగా పేరొందాయి. సింహగిరుల్లో 70 రకాల వృక్షజాతులు, 200 రకాలైన ఔషధమొక్కల జాతులున్నట్లు గుర్తించారు. అదేవిధంగా వందలాది రకాల వన్యప్రాణులు ఈ కొండలపై ఉన్నాయి. అయితే సింహాచలం కొండలు గతంలో ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో కొందరు ఆకతాయిలు కొండలపై నిప్పు పెట్టడంతో పలు ఔషధ మొక్కలు అగ్నికి ఆహుతవ్వగా వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. వీటన్నింటి నుంచి సింహగిరులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహగిరి కొండల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టేందుకు అడుగులు వేస్తోంది.  

తొలి విడతలో 4.15 కి.మీ నిర్మాణానికి టెండర్లు 
సింహగిరిపై మొత్తం 4.15 కిలోమీటర్ల పొడవున్న రక్షణ గోడ నిర్మాణానికి రూ.3.59 కోట్లతో విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) టెండర్లు ఆహ్వానించింది. ఫేజ్‌–1, ఫేజ్‌–2గా విభజించి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. చినగదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకూ 2.924 కిలోమీటర్లు, దుర్గానగర్‌ నుంచి పోర్ట్‌క్వార్టర్స్‌ హిల్స్‌ వరకూ 1.225 కి.మీ మేర ప్రహరీ నిర్మించనుంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించామనీ, 30వ తేదీన టెండర్లు పరిశీలన నిర్వహిస్తామని వీఎంఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు