డోలీ కష్టాలకు చెక్‌ 

20 Sep, 2023 02:52 IST|Sakshi

గిరిశిఖర గ్రామాల్లో ప్రగతి బాటలు

శరవేగంగా రోడ్డు పనులు 

శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు ఇకపై కనిపించవని ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ కృషితో గిరిశిఖర గ్రామాలకు చేరుకునేందుకు మార్గం సుగమమవుతోందని చెప్పారు. కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, దీనికి విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు వేస్తున్న రోడ్డే నిదర్శనమని అన్నారు. ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామాలైన దారపర్తి, పల్లపుదుంగాడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు.

ప్రభుత్వ సంక్షేమ పాలనను వివరించారు. పథకాల అందుతున్న తీరును గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పల్లపుదుంగాడలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2019లో ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చినపుడు ప్రాణాల మీదికి వస్తే డోలీ మోతలే దిక్కు అని, దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు రోడ్డు వేయమని గిరిజనులు అడిగారన్నారు. ఆ మేరకు అటవీశాఖ అనుమతులు సాధించి దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు ఐదు కిలోమీటర్ల రోడ్డును రూ.4.50 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు.

పల్లపుదుంగాడ నుంచి దారపర్తి వరకూ మరో 6 కి.మీ మేర రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద పల్లపుదుంగాడలో ప్రతి ఇంటికి కుళాయిలు వేసి తాగునీరు ఇచ్చామని.. పొర్లు, కురిడి, గూనపాడు, ధారపర్తి గ్రామాల్లో కుళాయిలు వేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం ధారపర్తి ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు పినిశెట్టి వెంకటరమణ, స్టేట్‌ ఫోక్‌ అకాడమీ డైరెక్టర్‌ వి.రాంబాబు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు