తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి 8 గంటలు

23 Oct, 2023 08:14 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని  77,187 మంది భక్తులు దర్శించుకోగా.. 29,209 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం  3.06 కోట్లు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించాడు. మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం సాగింది. రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, చైర్మన్‌ భూమన దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గ­వి ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సోమవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నా­రు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి చక్రస్నానం చేపడతారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వ­హిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక కేలండర్‌ను చైర్మన్‌ భూమన, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువైన ఈ కేలండర్‌ను 50 వేల కాపీలను టీటీడీ ముద్రించింది.
చదవండి: ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! 

మరిన్ని వార్తలు