పోస్టల్‌ బ్యాంక్‌ నుంచి ‘డాక్‌పే’ యాప్‌

17 Dec, 2020 03:59 IST|Sakshi

దేశంలో ఎక్కడికైనా క్షణాల్లో నగదు పంపిణీ

గ్రామీణ ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు

అన్ని బ్యాంక్‌ అకౌంట్లు డాక్‌పేకి అనుసంధాన వెసులుబాటు

సాక్షి, అమరావతి: మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి దేశంలో ఎక్కడికైనా తక్షణం నగదు పంపిణీ చేసే సౌకర్యాన్ని తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ‘డాక్‌పే’ పేరుతో మొబైల్‌ డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. డాక్‌పే యాప్‌ ద్వారా అన్ని బ్యాంకు అకౌంట్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది. నగదు బదిలీ, చెల్లింపులతో పాటు పోస్టల్‌ శాఖ అందిస్తున్న వివిధ సేవింగ్స్‌ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. 

డాక్‌పే యాప్‌ అందిస్తున్న సేవలు  
యూపీఐ: ఒక బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మరో బ్యాంక్‌ అకౌంట్‌కు సురక్షితంగా, వేగంగా నగదు బదిలీ.
వీడీసీ: రూపే డెబిట్‌ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లకు డిజిటల్‌ విధానంలో చెల్లింపులు చేయొచ్చు.
డీఎంటీ: దేశంలో ఎక్కడి బ్యాంకు ఖాతాకైనా తక్షణం నగదు బదిలీ చేసుకోవచ్చు.
ఏపీఎస్‌: ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సర్వీసుల్లో భాగంగా ఇంటి వద్దనే వేలి ముద్ర వేయడం ద్వారా బ్యాంకు సేవలు పొందవచ్చు.
బిల్‌ చెల్లింపులు : దేశ వ్యాప్తంగా 470కిపైగా వ్యాపార సంస్థలకు నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంటుంది.
పోస్టల్‌ పథకాలు: తపాల శాఖ అందిస్తున్న రికరింగ్‌ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సంవృద్ధి ఖాతా వంటి వివిధ ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చు.  

మరిన్ని వార్తలు