వన్‌.. టూ.. 'త్రీ'.. రెడీ!

8 Jun, 2021 04:26 IST|Sakshi

థర్డ్‌వేవ్‌ వచ్చినా రాకున్నా ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్య శాఖ సిద్ధం

ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారి థర్డ్‌వేవ్‌తో మరోసారి విరుచుకుపడినా ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా కట్టడి చేసి బాధితులకు చికిత్స అందించడం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. రెండు వేవ్‌లలో నమోదైన కేసులు, వయసు, ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్యపై వారం రోజులుగా సమీక్షించడంతోపాటు ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు, పీడియాట్రిక్‌ డాక్టర్లతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొదటి, రెండో వేవ్‌లలో జూన్‌ 7 నాటికి 17.63 లక్షల పైచిలుకు మందికి కరోనా సోకింది. ఈ అంచనాను బట్టి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించారు.

భారీగా మందుల కొనుగోలుకు నిర్ణయం 
చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ యథావిధిగా కొనసాగిస్తూనే అవసరమైన సిరప్‌లు, ఓఆర్‌ఎస్, రెమ్‌డెసివిర్, యాంపొటెరిసిన్‌ బి ఇంజక్షన్లు, వైద్య ఉపకరణాలు తగినన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక వెంటిలేటర్లు, అంబూబ్యాగ్‌లు భారీగా కొనుగోలు చేయనున్నారు. హై ఫ్లో నాజల్‌ ఆక్సిజన్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా సమకూర్చుతారు. పీడియాట్రిక్‌ వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మేరకు నియమిస్తారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బరువు తూచేందుకు 498 మెషీన్లు అవసరమని అంచనా వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులున్న  దాదాపు 15 – 20 లక్షల మంది తల్లులందరికీ కోవిడ్‌ టీకాలు ఇవ్వనున్నారు. 

యుక్త వయసు వారిలో అధికం!
తొలివేవ్‌లో 50 ఏళ్లు దాటిన వారికి, సెకండ్‌ వేవ్‌లో 30 ఏళ్ల వయసు వారికి కరోనా సోకిన నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ వస్తే యుక్త వయసు వారిలో ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 75 శాతం కేసులు ఒకే నెలలో నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులకు కరోనా రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. థర్డ్‌ వేవ్‌లో గరిష్టంగా 18 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, వీరిలో 18 ఏళ్ల లోపు వారు 4.50 లక్షల మంది ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు