మన్యంలో ‘సుగంధ’ పంటల పరిమళం

17 May, 2021 05:10 IST|Sakshi

సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ కృషి 

ఏటా సాగు విస్తీర్ణం పెంపునకు ఉద్యాన శాఖ ప్రణాళిక 

ప్రత్యేక రాయితీలు, ఉచితంగా మొక్కల పంపిణీ

సాక్షి, విశాఖపట్నం: సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైన అల్లం, పసుపు, మిరియాల పంటల సాగుకు విశాఖ మన్యం ఇప్పటికే పేరొందింది. తాజాగా జాజికాయ, లవంగం, దాల్చిన చెక్క సాగును సైతం చేపట్టిన గిరిజన రైతులు లాభాల పరిమళాలను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి సమశీతల వాతావరణం, మెరుగైన వర్షపాతం, సారవంతమైన ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మేటిగా నిలుస్తున్న కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కన్నా సేంద్రియ విధానంలో పండిస్తున్న మన్యం మసాలా సరుకులకు క్రమేపీ డిమాండ్‌ పెరుగుతోంది. వీటిని సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మేలు రకం మొక్కలను తీసుకొచ్చి ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అందిస్తోంది. 

పసుపు మిసమిసలు 
ఇక్కడ పండించిన పసుపు కిలో రూ.82 నుంచి రూ.85 వరకూ ధర పలికింది. ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌ పొందిన రైతు సహకార ఉత్పత్తి సంఘాలైతే రూ.90 నుంచి రూ.95 వరకూ విక్రయించాయి. 20,552 ఎకరాల్లో సేంద్రియ విధానంలో పండిస్తున్న ఇక్కడి పసుపులో నాణ్యత, ఛాయ అధికంగా ఉంటోంది. ఏటా రెండు వేల ఎకరాల చొప్పున ఐదేళ్లలో మరో 10 వేల ఎకరాల్లో పసుపు సాగును విస్తరించేందుకు పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. 

అదిరే అల్లం 
మన్యంలో 300 ఎకరాల్లో అల్లం సాగవుతోంది. ఘాటు తక్కువగా ఉన్నా పరిమాణంలో పెద్దగా ఉండటంతో వ్యాపారులు పచ్చళ్ల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశవాళీ చింతపల్లి, నర్సీపట్నం రకాల అల్లంలో ఘాటు ఎక్కువ. పీచు కూడా ఎక్కువే. ఒక దశలో కిలో ధర రూ.150 వరకూ వెళ్లింది. ప్రస్తుతం రూ.82 నుంచి రూ.100 వరకు ఉంది. 

కేరళను తలదన్నే మిరియాలు 
కాఫీ తోటల్లో అంతర పంటగా 98 వేల ఎకరాల్లో మిరియం సాగు అవుతోంది. ఈ ఏడాది దాదాపు 4 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచి్చంది. ధర కిలో రూ.360 నుంచి రూ.400 వరకూ ఉంది. కేరళ మిరియం కన్నా మన్యం మిరియంకే మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. 

రెక్కలు తొడుగుతున్న లవంగం 
కర్ణాటకలోని సిరిసి ప్రాంతం నుంచి పెనాంగ్‌ రకం లవంగాల మొక్కలను ఉద్యాన శాఖ గత ఏడాది తీసుకొచ్చి గిరిజన రైతులకు ఉచితంగా అందజేసింది. దాదాపు వంద ఎకరాల్లో వేసిన మొక్కలు ఎదుగుదల బాగానే ఉంది. 

మొలిచిన ‘దాల్చిన’ 
కేరళలో కాలికట్‌లోనున్న జాతీయ సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం నుంచి దాల్చిన మొక్కలను ఉద్యాన శాఖ తీసుకొచ్చి కొంతమంది రైతులకు అందజేసింది. దాదాపు వంద ఎకరాల్లో అంతర పంటగా ఈ మొక్కలను వేశారు. ఈ ఏడాది మరింత విస్తరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

సుగంధ ద్రవ్యాల సాగుతో మంచి ఆదాయం 
నాణ్యమైన సుగంధ ద్రవ్య పంటల సాగుకు మన్యంలోని వాతావరణం, సారవంతమైన నేలలు ఎంతో అనుకూలం. ఈ ప్రాంతంలో అల్లం, పసుపు, మిరియాలే కాకుండా జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క వంటి వాణిజ్య పంటలను విస్తరించడానికి అవకాశం ఉంది. పసుపు, అల్లం సాగుకైతే ప్రభుత్వం హెక్టారుకు రూ.12 వేలు, మిరియం సాగుకు రూ.8 వేలు రాయితీగా ఇస్తోంది. జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మొక్కలు వేసిన వారికి రూ.20 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది.  
– కె.గోపీకుమార్, ఉద్యాన శాఖ ఉపసంచాలకులు, విశాఖ జిల్లా  

వేళ్లూనుకుంటున్న జాజికాయ 
గత ఏడాదే మన్యంలోకి జాజికాయ మొక్కలు అడుగుపెట్టాయి. కర్ణాటకలోని సిరిసి ప్రాంతం నుంచి విశ్వశ్రీ రకం మొక్కలను ఉద్యాన శాఖ అధికారులు తీసుకొచ్చి రైతులకు ఇచ్చారు. ప్రస్తుతం 80 ఎకరాల్లో ఏపుగా పెరుగుతున్న ఈ మొక్కలు ఐదో ఏట నుంచి దిగుబడినిస్తాయి.  

మరిన్ని వార్తలు