నాణ్యతలేని మందులకు కళ్లెం..

16 Nov, 2023 04:57 IST|Sakshi

ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు 

మందుల షాపులు, తయారీ సంస్థల్లో తనిఖీలకు ప్రత్యేక యాప్‌  

సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో  నాణ్యమైన మందులే ప్రజలకు అందేలా అనేక చర్యలు చేపట్టింది. ప్రమాణాల మేరకు లేని మందులను లేకుండా చేసేందుకు నాలుగున్నరేళ్లుగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా జాతీయస్థాయితో పోలిస్తే మన రాష్ట్రంలో నాట్‌ ఆఫ్‌ స్టాండర్డ్‌ క్వాలిటీ (ఎన్‌ఎస్‌­క్యూ) మందులు తక్కువగా ఉంటున్నాయి.  దేశవ్యాప్తంగా సగటున 4% ఎన్‌ఎస్‌క్యూ మందులు బయటపడుతు­న్నాయి. రాష్ట్రంలో ఈ మందుల శాతం 1.55 మాత్రమే.  

ఇంటెలిజెంట్‌ శాంపిలింగ్‌ విధానం  
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటి వరకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ అభీష్టం మేరకు మందుల షాపులు, తయా­రీ యూనిట్లను ఎంచుకుని తనిఖీ చేసేవారు. మూసధోరణిలో సాగే ఈ విధానానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్వస్తిపలికింది. ఇంటెలిజెంట్‌ శాంపిలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్‌గా తనిఖీల నిర్వహణ, ఇంటెలిజెంట్‌ శాంపిలింగ్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో కంప్యూటర్‌ ఎయిడెడ్‌ సెలక్షన్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్షన్‌ యాప్‌ను రూపొందించారు. ఈ విధానంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని ఏ షాప్‌లో తనిఖీ చేయాలనే విషయమై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానంలో అలర్ట్‌ వెళుతుంది.

యాప్‌ సూచించిన షాపు, తయారీ యూనిట్‌లో తనిఖీలు నిర్వహించి, రిపోర్టులను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. మరోవైపు శాంపిళ్ల సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో ఎస్‌వోపీ రూపొందించారు. మార్కెట్‌లో ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులు, అసాధారణంగా ధరలు ఎక్కువ/తక్కువ ఉండటం.. ఇలా వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని శాంపిళ్లు సేకరించి విశ్లేషణకు లే»ొరేటరీలకు పంపుతున్నారు.   

నిరంతర నిఘా  
రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్‌ బ్యాంకులు, 132 బ్లడ్‌ స్టోరేజ్‌ సెంటర్లు, 44,973 హోల్‌సేల్, రిటెయిల్‌ మందుల షాపులు ఉన్నాయి. నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తయారీ సంస్థలు, హోల్‌సేల్, రిటెయిల్‌ మందుల షాపులపై ఔషధ నియంత్రణ విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకు మందుల షాపుల్లో 12,686, మందుల తయారీ యూనిట్లలో 243 తనిఖీలు చేసింది. వాటిలో 3,015 నమూనాలను సేకరించి విశ్లేషించింది. ఈ విశ్లేషణలో 47 నమూనాలు (1.55%) ఎన్‌ఎస్‌క్యూగా తేలింది. ఎన్‌ఎస్‌క్యూగా తేలిన ఘటనల్లో అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటికి 16 కేసుల్లో దోషులకు కోర్టు శిక్ష విధించింది.   

మరిన్ని వార్తలు