‘మద్యం’పై మాట్లాడే అర్హత పురందేశ్వరికి లేదు 

16 Oct, 2023 06:28 IST|Sakshi

జగనన్న ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు 

చంద్రబాబు ప్రభుత్వంలో 7 డిస్టిలరీలకు అనుమతి 

మరిదిని కాపాడుకునే తాపత్రయం ఆమెది: డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి 

పుత్తూరు రూరల్‌: మద్యం పాలసీపై మాట్లాడే అర్హత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి లేదని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు. ఆది­వారం తిరుపతి జిల్లా పుత్తూరులో మీడియాతో మా­ట్లాడుతూ.. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తీసుకొస్తే.. ఆయన స్థాపించిన పార్టీని చంద్రబాబు లాక్కుని మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు పురందేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలించిన 2014–19 కాలంలోనే ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు.

2019లో ఏర్పడిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క డిస్టలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గాని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పీఎంకే డిస్టలరీ యనమల రామకృష్ణుడిదని, శ్రీకృష్ణ డిస్టలరీ ఆదికేశవులనాయుడిదని, స్పై డిస్టిలరీ ఎస్పీవై రెడ్డిదని, విశాఖ డిస్టిలరీ అయ్యన్నపాత్రుడిదని వివరించారు. ఇప్పుడున్న ప్రతి బ్రాండు చంద్రబాబు పాలనలో తీసుకొచ్చినవే అని, అందుకే వాటిని ‘సీ’ బ్రాండ్లు అంటున్నారని తెలిపారు. కేజీహెచ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నెలకు సుమారు 20 మంది పాడైన లివర్, పాంక్రియాస్‌ రోగులు అడ్మిట్‌ అవడమనేది పదేళ్లుగా జరుగుతున్న విషయమేనని స్పష్టం చేశారు.  

మద్యపానం చేస్తే లివర్‌ చెడిపోవచ్చు 
బ్రాండుతో సంబంధం లేకుండా మద్యాన్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు తీసుకుంటే లివర్‌ చెడిపోవచ్చని మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. దేశంలోనే మద్యం సేవించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగిందని నిమ్హాన్స్‌ నివేదిక స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాశాయని గుర్తు చేశారు. చంద్రబాబు తన అనుచర గణానికి 4,378 మద్యం షాపులను కట్టబెట్టడమే కాకుండా, 43 వేల బెల్ట్‌ షాపులు పెట్టి మద్యపానాన్ని ఏరులై పారించారని గుర్తు చేశారు.  

అందుకే పురందేశ్వరి మద్యం పాట పాడుతోంది 
పురందేశ్వరి తన మరిది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ను కాపాడేందుకే మద్యం పాట పాడుతున్నారని మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. పురందేశ్వరి బీజీపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి, ఆమె భర్త సైతం ఎన్టీఆర్‌ మృతికి కారకులయ్యారని, ఎన్టీఆర్‌ కూతురుగా చెప్పుకోవడానికి ఆమెకు అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్‌కళ్యాణ్‌ అని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ న్యాయపరంగానే జరిగిందని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందన రాలేదన్నారు. 


 

మరిన్ని వార్తలు