‘స్కిల్‌’ కుంభకోణం కేసులో 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దు

30 Sep, 2023 04:37 IST|Sakshi

సీఐడీకి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌రెడ్డి ఆదేశం

తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా

సాక్షి, అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్‌ 4వ తేదీ వరకు లోకేశ్‌ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.

సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో లోకేశ్‌ను ఇప్పటివరకు నిందితునిగా చేర్చలేదని కోర్టుకు నివేదించారు. నిందితుడు కానప్పుడు అరెస్ట్‌ చేయడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. కేవలం భయాందోళనతోనే ఈ పిటిషన్‌ దాఖలు చేశారని వివరించారు. ఇప్పటికైతే అరెస్ట్‌ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్లమని, తాము ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తామని చెప్పారు.

చంద్రబాబు అరెస్టు సందర్భంగా సీఐడీ దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టులో అంశాల ఆధారంగా వాళ్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీకి లోకేశ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, ఆయన తండ్రి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పారు. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయిందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తమ వద్ద ఆధారాలున్నాయని వివరించారు. ఆ రిమాండ్‌ రిపోర్టును ఆధారంగా 20 రోజుల తరువాత ఇప్పుడు పిటిషన్‌ దాఖలు చేశారన్నారు.

లోకేశ్‌ చెబుతున్న కారణాల్లో సదుద్దేశం కనిపించడంలేదని, సంబంధం లేని అంశాలన్నింటినీ లేవనెత్తుతున్నారని చెప్పారు. నిందితునిగా చేర్చకుండానే బెయిల్‌ ఇవ్వాలంటూ ఎలా కోర్టుకొస్తారని ప్రశ్నించారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. బుధవారం లేదా గురువారం విచారణ జరిపినా అభ్యంతరం లేదని, అప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోర్టుకు నివేదించారు.

అంతకు ముందు లోకేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్‌ కోరుతున్నామన్నారు. చంద్రబాబు రిమాండ్‌ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులని పేర్కొందని, సీఐడీ ఉద్దేశాన్ని ఇది స్పష్టం చేస్తోందని చెప్పారు.

చంద్రబాబునే సీఐడీ అధికారులు ఈ కేసులో అక్రమంగా, అన్యాయంగా ఇరికించారని, తప్పుడు కేసు బనాయించారని అన్నారు. లోకేశ్‌ విషయంలో కూడా అదే రీతిలో చేస్తారని, సీఐడీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. 4వ తేదీ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, కావాలంటే ఆ తరువాత విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై ఏ నిర్ణయమైనా తీసుకోండని కోర్టును అభ్యర్థించారు. 

మరిన్ని వార్తలు