అసత్యాల తవ్వకం

24 Nov, 2023 05:22 IST|Sakshi

పల్నాడులో క్వార్ట్‌  మైనింగ్‌ అంటూ ‘ఈనాడు’ అభూత కల్పనలు 

అసలు అనుమతుల్లేకుండా 50 వేల టన్నుల తవ్వకం ఎలా సాధ్యం? 

తవ్వకాల్లేకుండా ప్రభుత్వానికి రాయల్టీ వస్తుందా రామోజీ? 

గతంలో జరిగిన మైనింగ్‌ ఫొటోలతో ఈనాడు వక్రీకరణ 

రాజకీయంగా బురదజల్లేందుకే ప్రజాప్రతినిధి దోపిడీ అంటూ కట్టుకథ  

సాక్షి, అమరావతి: ప్రజల్లో పట్టుకోల్పోయిన టీడీపీని.. జనాలు మర్చిపోయిన చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు ఈనాడు రామోజీరావు ఇంత వయస్సులోనూ ఇంకా ప్రయాస పడుతూనే ఉన్నారు. గతంలో తన పార్ట్‌నర్‌ ప్రజలకు చేసిందేమీలేదని ఆయనకు బాగా తెలుసు. అలాగే, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదల జీవితాల్లో తీసుకొస్తున్న పెనుమార్పులు కూడా ఆయనకు తెలియంది ఏమీకాదు.

అయినా, రామోజీ ఆశ చాలా లావు కదా. సీఎం జగన్‌పైన.. రాష్ట్ర ప్రభుత్వంపైనా ప్రజల్లో ఎలాగోలా విద్వేషాన్ని రగిల్చి తన కార్యం తన బంటు కార్యం తీర్చుకునేందుకు చేయని కుట్రలేదు.. తొక్కని అశుద్ధంలేదు. ఇందులో భాగంగానే తన అసత్యాల గని నుంచి నిత్యం తప్పుడు కథనాలను తవ్వి ఈనాడులో ఎత్తిపోస్తున్నారు. తాజాగా.. గురువారం ‘క్వార్ట్‌ ్జ కొల్లగొట్టారు’ అంటూ ప్రభుత్వ ప్రతిష్టపై ఎప్పటిలాగే బురదజల్లే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. వాస్తవాలు ఏమిటంటే..

క్వార్ట్‌ ్జతవ్వకాలకు అనుమతుల్లేవు..
నిజానికి.. రాష్ట్రంలో ఎక్కడా దేవుడి మాన్యంలో ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలు జరగడంలేదు. అసలు మైనింగ్‌ జరగకుండా ఏకంగా 50 వేల టన్నుల ఖనిజం ఎలా తవ్వారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈనాడు చెబుతున్నట్లు పల్నాడు జిల్లా కారంపూడి మండలం సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల్లో క్వార్ట్‌ ్జ తవ్వకాలకు మైనింగ్‌ శాఖ ఎటువంటి అనుమతులు మంజూరుచేయలేదు. 2012లో దేవదాయ శాఖ సింగరుట్ల ఆలయ పరిధిలోని బ్లాక్‌ 28 ప్రాంతంలో పదెకరాల భూమిని రమాదేవి అనే వ్యక్తికి మైనింగ్‌ కార్యకలాపాల కోసం లీజుకిచ్చింది.

అయితే, 2022లో ఈ మైనింగ్‌ అనుమతులను గనుల శాఖ రద్దుచేసింది. అలాగే, 2021లో ఇదే దేవాలయానికి చెందిన మరో 25 ఎకరాల భూమిని మైనింగ్‌ కార్యకలాపాల కోసం దేవదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు పాల్గొని 12.5 ఎకరాల చొప్పున దక్కించుకున్నారు. అయితే.. సదరు వ్యక్తులు క్వార్జ్‌ తవ్వకాల కోసం మైనింగ్‌ అధికారులకు ఎలాంటి దరఖాస్తు చేయలేదు. దీంతో గనుల శాఖ ఎటువంటి క్వార్జ్‌ మైనింగ్‌ లీజులు ఇవ్వలేదు.

మైనింగ్‌ లేనప్పుడు రాయల్టీ ఎలా వస్తుంది!?
పల్నాడుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి క్వార్జ్‌ మైనింగ్‌ పేరుతో దోపిడీ చేశారని ‘ఈనాడు’ ఆరోపించడం విడ్డూరం. అసలు జరగని మైనింగ్‌ నుంచి ఏకంగా 50 వేల టన్నులకు పైగా తవ్వకం జరిగినట్లు, ఎగుమతి కూడా అయిపోయినట్లు కట్టుకథ అల్లేసింది. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వానికి రాయల్టీ దక్కలేదంటూ ఈనాడు పెట్టిన శోకాలు మామూలుగా లేవు. అయినా.. అసలు మైనింగ్‌ అనుమతులే లేకుండా.. తవ్వకాలు జరపకుండా ప్రభు­త్వా­నికి రాయల్టీ ఎలా వస్తుందో ఆ కిటుకు రామోజీనే చెప్పాలి.  

మైనింగ్‌పై పటిష్ట నిఘా..
వాస్తవానికి.. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది. ప్రతి జిల్లాకు విజిలెన్స్‌ స్క్వాడ్‌లను నియమించింది. మైనింగ్‌పై ఎక్కడ ఆరోపణలు వచ్చినా ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, అన్నిచోట్లా చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటుచేసి మైనింగ్‌ను, అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అంత పెద్దఎత్తున క్వార్జ్‌ మైనింగ్, అక్రమ రవాణా ఎలా సాధ్యమవుతుంది రామోజీ.. మీ పిచ్చి కాని..!

పాత ఫొటోలతో కట్టుకథ..
రాష్ట్రంలో ఎక్కడా అక్రమ మైనింగ్‌లకు అవకాశమేలేదు. అసలు పల్నాడులో క్వార్జ్‌ మైనింగ్‌ చేసిన ఉదంతాలే లేవు. గతంలో ఆ ప్రాంతంలో జరిగిన మైనింగ్‌ ఫొటోలతో ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడం దారుణం. కనీసం  వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికా­రులను కూడా సంప్రదించకపోవడం సరికాదు. ఇటువంటి తప్పుడు రాతలపై ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు