ఆధారాలు ఉన్నందునే ఆక్రమణల తొలగింపు 

10 Nov, 2022 03:43 IST|Sakshi
భూములు తమవేనని ఏయూ గతంలో ఏర్పాటు చేసిన బోర్డు

అన్యాక్రాంతమైన ఏయూ భూములను స్వాధీనం చేసుకోవడం కలకలమా? 

వస్తువులు తీసుకుని మధ్యాహ్నానికే వెళ్లిపోయిన దుకాణదారులు 

1992లోనే ఏయూకు అనుకూలంగా స్పెషల్‌ కోర్టు తీర్పు  

దొండపర్తి (విశాఖ దక్షిణ): అన్యాక్రాంతమైన భూములను ఆంధ్రా యూనివర్శిటీ తిరిగి స్వాధీనం చేసుకోవడం దారుణమా? ఆక్రమిత భూముల్లో నిర్మించిన దుకాణాలను తొలగించడం కూల్చివేతల కలకలమా? ఏయూ ఆస్తులను కబ్జా చేసి అనుభవిస్తున్న ప్రైవేట్‌ వ్యక్తులపై టీడీపీ నేతలకు ఎందుకంత ప్రేమ? ఈనాడు ప్రచురించినట్లుగా 16 షాపుల్లో 200 మంది పని చేస్తుంటే అవి చిన్న దుకాణాలా? టీడీపీ నాయకుల డ్రామాలు, ఎల్లో మీడియా కథనాల్లో నిజం ఉందా? కబ్జాదారుల చెర నుంచి తమ భూములను ఆంధ్రా యూనివర్శిటీ స్వాధీనం చేసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రైవేట్‌ వ్యక్తులను సమర్థించటాన్ని అంతా  తప్పుబడుతున్నారు.

ఏయూ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు నిర్మించిన వారి వద్ద ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. దుకాణదారులంతా తమ వస్తువులు తీసుకొని మధ్యాహ్నానికే అక్కడ నుంచి వెళ్లిపోయారు. చాలా ఏళ్లుగా ఆక్రమణలకు గురైన విలువైన ఏయూ భూములను స్వాధీనం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఏయూ పూర్వ విద్యార్థులు, నగరపౌరులు దీనిని స్వాగతిస్తున్నారు.  

► విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీకి పాత సీబీఐ జంక్షన్‌ నుంచి పోలమాంబ ఆలయం వరకు సువిశాలమైన భూమి ఉంది. ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమించి అనధికారంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. బడాబాబుల అండదండలతో కార్‌ షెడ్లు, మాంసం దుకాణాలు, టీ పాయింట్లు, టిఫిన్‌ సెంటర్లు  నిర్వహిస్తూ అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. టీడీపీ హయాంలో కబ్జాదారులు దుకాణాలను నిర్మించుకుని నెమ్మదిగా విస్తరించినా కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా ఏయూ అధికారులు మరోసారి జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణాలను సోమవారం తొలగించారు. 

► పెదవాల్తేరు పోలమాంబ ఆలయానికి ఆనుకుని ఏయూకు 2.5 ఎకరాల భూమి ఉంది. 1941లోనే దీన్ని నిర్ణీత రుసుము చెల్లించి కొనుగోలు చేసింది. కలెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం అప్పటి నుంచి ఆ భూమి ఏయూ స్వాధీనంలోనే ఉంది. టౌన్‌ సర్వే రిజిస్టర్‌ ప్రకారం ఈ భూములు ఏయూకు చెందినవేనని 1989 నాటి అడంగల్‌ కాపీలు ఏయూ వద్ద ఉన్నాయి. 

► 1992లో ఈ స్థలాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నించిన కొందరు కోర్టుకు వెళ్లగా స్పెషల్‌ కోర్టు ఏయూకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 1993 ఫిబ్రవరి 16న తహశీల్దార్‌ స్వయంగా ఇక్కడ ఉన్న తాటాకు ఇళ్లను తొలగించారు. ఆక్రమణదారులైన కుందం అప్పారావుతో పాటు మరో 13 మంది నుంచి భూమిని స్వాధీనం చేసుకొని ఖాళీ స్థలాన్ని ఏయూకు అప్పగించారు. దీనిపై ఏయూకే సర్వహక్కులు ఉన్నాయంటూ తహశీల్దార్‌ ఏయూకు లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. 

► పెట్రోల్‌ బంక్‌ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారి విస్తరణకు ఏయూకు చెందిన ఈ స్థలం నుంచే కొంత భూమిని జీవీఎంసీకి అప్పగించింది. దీనికి పరిహారంగా ఏయూకు జీవీఎంసీ ప్రత్యామ్నాయ భూమిని సైతం ఇచ్చింది. అందులోనే ఏయూ  అంతర్జాతీయ విద్యార్థినుల హాస్టల్‌ సముదాయాన్ని నిర్మించింది. 

అన్ని ఆధారాలున్నాయి.. 
ఆక్రమణలు తొలగించిన స్థలం నిస్సందేహంగా ఏయూదే. ఆ పత్రాలన్నీ మావద్ద ఉన్నాయి. గతంలో పనిచేసిన వీసీలు, రిజిస్ట్రార్‌లు కూడా వీటిని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో అప్పటి ప్రభుత్వాలను కోరారు. 
– ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి, వీసీ 

మరిన్ని వార్తలు