‘పట్టణ మహిళల ప్రగతి’కి తోడ్పాటు

27 Oct, 2023 05:05 IST|Sakshi

ఎస్‌హెచ్‌జీ సభ్యులతో 165 సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు చేయాలని నిర్ణయం

ఒక్కో యూనిట్‌కు రూ.2.50 లక్షల ఆర్థిక సాయం

వచ్చే నెలలో శిక్షణ

సాక్షి, అమరావతి: ఆర్థికంగా కాస్త ఆసరా ఇచ్చి అండగా నిలిస్తే మహిళలు అద్భుతాలు సాధిస్తారని మ­న­స్ఫూర్తిగా నమ్మిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడు­గడుగునా వారిని ప్రోత్సహిస్తూనే ఉంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రు­ణాలు అందించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దిశగా సహకరిస్తోంది. జగనన్న మహిళా­మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్‌ మార్కెట్‌లు విజయవంతం కావడంతో పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల కోసం పట్టణ పేదరిక నిర్మూ­లనా సంస్థ (మెప్మా) మరో ముందడుగు వేసింది.

ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాల్లో, పర్యా­వరణ హితమైన సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు కా­ర్యా­చరణ చేపట్టింది. ఈ అంశంపై గత నెలలో పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్‌ఎఫ్‌ రిసోర్స్‌ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యద­ర్శులు, కోశా«­ది­కా­రులతో మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో దాదాపు 165 సూ­క్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదించారు. ఒ­క్కో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభు­త్వం తరఫున రూ.2.50 లక్షల సాయం అందించాలని నిర్ణ­యిం­చారు. యూనిట్ల ఏర్పాటు, నిర్వహణపై ఆ­యా రంగాల నిపుణులతో వచ్చే నెలలో మహిళ­ల­­కు శిక్షణ ఇస్తారు.

గత నాలుగు­న్న­రే­ళ్లు­గా మెప్మా పట్టణ పొదుపు సంఘాల మహి­ళ­లను వ్యాపార యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రోత్స­హి­­స్తోంది. ఇప్పటి­­వరకు 11 మహి­ళా మార్టులు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇ­దే తరహాలో 140కి పైగా ఆహా క్యాంటీన్లు ఏర్పా­టు చేశారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా అర్బన్‌ మా­ర్కె­­ట్లు సైతం ఏర్పాటు చేసి, మహిళలు తయా­రు చే­సిన ఉ­త్పత్తులను మార్కెట్‌ చేస్తున్నారు. ఇ­వ­న్నీ వి­జ­య­వంతం కావడంతో మెప్మా పర్యా­వర­ణ హి­త సూక్ష్మ పరిశ్రమలను పట్టణ మహిళా ప్రగ­తి యూ­­నిట్ల పేరిట ఏర్పాటు చేయాలని నిర్ణయిం­చిం­ది. 

32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళల ఆసక్తి
మహిళల ఆధ్వర్యంలో స్థాపించే సూక్ష్మ పరిశ్రమ­లకు అవసరమైన మూలధనం సేకరణ, పరిశ్రమ స్థాప­న, నిర్వహణ, మార్కెటింగ్‌ వంటి అంశాలపై వ­చ్చే నెలలో నిపుణులతో శిక్షణనివ్వాలని మెప్మా నిర్ణయించింది. రాష్ట్రంలోని 120 యూఎల్బీల నుంచి 32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ఆసక్తి చూపారు. ఇలా వచ్చిన ఆసక్తుల్లో మొత్తం 165 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించా­రు.

ఇందులో ఇద్దరు సభ్యుల నుంచి 35 మంది స­భ్యు­ల వరకు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయి. వీటి­లో వాడిపోయిన పూల నుంచి అగర్‌బత్తీల తయారీ, పేపర్‌ కప్పులు, ప్లేట్లు తయారీ, కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, జ్యూట్‌ బ్యాగ్‌ల మేకింగ్, కోల్డ్‌ ప్రెస్డ్‌ ఆయిల్, అరటినార ఉత్పత్తులు, మిల్లెట్స్‌తో నూడుల్స్‌ తయారీ, డ్రై వెజిటబుల్‌ ఫ్లేక్స్‌ తయారీ వంటివి ఉన్నాయి. 

అద్దె భారం లేకుండా చర్యలు 
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగు­ణంగా మెప్మా కృషి చేస్తోంది. సాధారణంగా పట్టణాల్లో చిన్న వ్యాపారం పెట్టాలన్నా గదుల అద్దె అధికంగా ఉంటుంది. మెప్మా ఏర్పాటు చేసే మహిళా ప్రగతి యూనిట్లను మున్సిపల్‌ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనివల్ల భవనాల అద్దె భారం, అడ్వాన్స్‌ చెల్లింపులు పెద్దగా ఉండవు. ఇది మహిళలకు ఊరట­నిస్తుంది. ఒక్కో యూనిట్‌ ఏర్పాటుకు ప్రభు­త్వం తరఫున గరిష్టంగా రూ.2.50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు