ఉచితంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్‌

13 Jan, 2022 03:50 IST|Sakshi

రూ.700 కోట్లకు పైగా చార్జీలు మాఫీ

ఈ నెల చివరి వారంలో 45 వేల ఇళ్ల పంపిణీ  

సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో) నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించి పేదలపై ఎలాంటి భారం లేకుండా చర్యలు తీసుకోనుంది.

ఈ నెల 21వ తేదీ నుంచి డాక్యుమెంటేషన్‌ పనులు ప్రారంభించి రిజిస్ట్రేషన్‌ చేసి ఈ నెల చివరి వారంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధంగా ఉన్న 45 వేల యూనిట్ల రిజిస్ట్రేషన్‌కు దాదాపు రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని పూర్తిగా భరించి లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్‌ తెలిపారు.

ఈ ఏడాది 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 1.18 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వీటిలో జనవరి చివరి వారంలో 45 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి అందించేందుకు టిడ్కో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 

మరిన్ని వార్తలు