అన్ని ఇసుక రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభించండి

5 Jun, 2021 04:29 IST|Sakshi

ఇసుకపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది సమీక్ష 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జేపీ పవర్‌ వెంచర్స్‌కు స్వాధీనం చేసిన అన్ని ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, విక్రయాలు వెంటనే ప్రారంభం కావాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఇసుక ఆపరేషన్స్‌పై గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ఇసుక రీచ్‌లను గత నెల 14వ తేదీన జేపీ పవర్‌ వెంచర్స్‌కు స్వాధీనం చేసినట్టు తెలిపారు. గత నెల 17 నుంచి ఆ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు, నిల్వ, రవాణా ప్రారంభమయ్యాయన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 384 రీచ్‌లు జేపీ గ్రూపునకు అప్పగించగా, వాటిల్లో 136 రీచ్‌లలోనే ఇసుక ఆపరేషన్లు జరుగుతుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం మిగిలిన అన్ని రీచ్‌ల్లోనూ ఇసుక ఆపరేషన్స్‌ ప్రారంభం కావాలని, ఇందుకోసం జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ)లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఆయా జిల్లాల పరిధిలోని రీచ్‌లలో జరుగుతున్న ఇసుక ఆపరేషన్స్‌పై కాంట్రాక్ట్‌ ఏజెన్సీ, శాండ్, మైనింగ్‌ అధికారులు రోజువారీ నివేదికలను జేసీలకు పంపాలని సూచించారు. వినియోగదారులకు సులభంగా ఇసుక లభ్యమయ్యేలా ఇసుక డిపోల ఏర్పాటును పరిశీలించాలని జేసీలను ఆదేశించారు. ప్రతి రీచ్‌ వద్ద కచ్చితంగా టన్ను ఇసుక రూ.475కు విక్రయించేలా చూడాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు అనుగుణంగా ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు