జీఐఎస్‌తో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం

27 Feb, 2023 02:58 IST|Sakshi
జీఐఎస్‌ సదస్సు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అధికారులు

సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)తో రాష్ట్ర ముఖచిత్రం మారనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటివరకు 25 దేశాలకు చెందిన 7,500 మంది పారిశ్రామిక దిగ్గజాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్‌ అంబానీ, అదానీ, టాటా, బిర్లా, జీఎంసీ గ్రూపుల అధినేతలు కూడా హాజరుకానున్నారని వెల్లడించారు.

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో మార్చి  3, 4 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సుతో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘమైన తీరప్రాంతం, విశాఖ వంటి ప్రశాంతమైన నగరం, అందుబాటులో ఉన్న యువత వంటి అంశాలు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా చేస్తాయని వివరించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, డైరెక్టర్‌   సృజన తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు