టీడీపీలో యూజ్‌ అండ్‌ త్రో పాలసీ..! అచ్చెన్న వ్యాఖ్యలు నిజమే?

2 Feb, 2023 10:52 IST|Sakshi

మామిడి గోవిందరావుకు షాక్‌ ఇచ్చేలా తాజా నిర్ణయాలు  

‘మామిడి’ వెంట వెళ్తున్న వారిపై వేధింపులు

కార్యరూపం దాల్చిన అచ్చెన్న వ్యాఖ్యలు  

నెరవేరుతున్న ‘కలమట’ పంతం  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీలో యూజ్‌ అండ్‌ త్రో పాలసీ మరోసారి తెరపైకి వచ్చింది. పాతపట్నం టీడీపీలో ‘చేతిచమురు’తో క్రియాశీలకంగా వ్యవహరించిన మామిడి గోవిందరావు విషయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. పార్టీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నా కూరలో కరివేపాకు మాదిరిగానే వాడుకుంటున్నట్టు మరోసారి స్పష్టమైంది. మామిడి వెంట తిరుగుతున్న వారిపై వేధింపులు ప్రారంభించి.. తనను కాదని వెళ్లితే టార్గెట్‌ చేయక తప్పదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కలమట వెంకటరమణ తన చేతల ద్వారా చూపిస్తున్నారు. అధినేతలు తన మాటకే విలువ ఇస్తారని టీడీపీ కేడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం పాతపట్నం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.  

కేడర్‌కు వేధింపులు.. 
టీడీపీలో డబుల్‌ గేమ్‌ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్‌ వస్తుందనే విధంగా గోవిందరావు దూకుడుగా వెళ్తున్నారు. టీడీపీలో ఉన్న అరకొర కేడర్‌ను నయానో భయానో తనవైపు తిప్పుకుంటున్నారు. దీంతో అక్కడ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న కలమట వెంకటరమణ ఉనికి తగ్గింది. అటు లోకేష్‌ను, ఇటు చంద్రబాబును తరుచూ కలుస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వదులుతూ  గోవిందరావు హడావుడి చేస్తున్నారు. అధిష్టానం వద్దే మామిడికే ప్రాధాన్యత ఉందని టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కరిగా మామిడి వైపు వస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన కలమట ..ఇంకా వదిలేస్తే తన అస్థిత్వానికే ముప్పుతప్పదని గ్రహించి యాక్షన్‌లోకి దిగారు. కేడర్‌ చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. తన నుంచి వెళ్తున్న నాయకులు, కార్యకర్తలపై వేధింపులు మొదలు పెట్టారు. 

పార్టీ పదవులుండి.. మామిడి వెంట వెళ్తున్న నాయకులపై వేటు వేయిస్తున్నారు. దానికొక ఉదాహరణగా ఎల్‌ఎన్‌పేట పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెలమల గోవిందరావు తాజాగా మామిడి గోవిందరావు వెంట వెళ్లడంతో ఆయన పదవిని తొలగించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌లకు చెప్పి హుటాహుటీన వెలమల గోవిందరావుకు ఉన్న మండల పార్టీ అధ్యక్ష పదవిని మెండ మనోహార్‌ అనే వ్యక్తికి కట్టబెట్టారు. దీంతో మామిడి వెంట ఉన్న వెలమల గోవిందరావు మరికొందరు నాయకులు ఎదురుదాడి చేసి కలమటపై ఆరోపణలు చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. 

ఇదంతా చూస్తుంటే నిమ్మాడలో అచ్చెన్నాయుడు చెప్పినట్టు మామిడి గోవిందరావును వాడుకోవడానికే తప్ప అంతకుమించి ఏమీ లేదన్న వ్యాఖ్యల్ని నిజం చేస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ రోజు..మామిడి గోవిందరావుకు టికెట్‌ ఇచ్చే ఆలోచన లేదని.. కలలో కూడా ఊహించొద్దని...నీ కోసం వాడుకోవడానికే ఉపయోగిస్తున్నానని..  పార్టీ కోసం డబ్బులిస్తున్నాడు.. తరుచూ చెక్‌లు తీసుకొచ్చి ఇస్తున్నాడు.. చెక్‌ కాదు కదా ఆస్తి రాసిచ్చినా పార్టీకి వాడుకుంటాం.. వాడుకోవాలన్నదే నా ఉద్దేశమని కలమట వెంకటరమణకు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయనిపిస్తోంది. మామిడి గోవిందరావు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరి వద్దకు తిరిగినా మా మద్దతు నీకే అన్నట్టుగా కలమటకు అనుకూలంగా అధినేతలంతా వ్యవహరిస్తున్నారు. దీంతో పారీ్టలో అంతర్గత పోరు మరింత ఎక్కువైనట్లయ్యింది. 

మరిన్ని వార్తలు