YSRCP Plenary 2022: అభిమాన సంద్రం.. వెయ్యికార్లతో తరలి వస్తున్న జగనన్న సైన్యం..

8 Jul, 2022 11:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తోన్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. ప్లీనరీ మొదటి రోజున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వెయ్యికార్లతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. దీంతో గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి అభిమాన సంద్రమైంది.

అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. కాగా, 2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశమైన నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగానే మూడో ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు.

చదవండి: (వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు)

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం ప్లీనరీ ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. ప్లీనరీ భద్రతా విధుల కోసం దాదాపు 3,500 మంది పోలీసులను నియమించినట్లు తెలిపారు. ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్‌ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు