‘అమరావతి’ పట్టాల పంపిణీని హర్షిస్తూ భారీ ర్యాలీ

26 May, 2023 05:09 IST|Sakshi

పాల్గొన్న ఎంపీ నందిగం సురేష్‌  

పలు ప్రాంతాల్లో సీఎం జగన్, వైఎస్సార్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

వెంకటపాలెం(తాడికొండ)/తాడేపల్లిరూరల్‌: అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్‌ కుమార్‌ పాల్గొని వెంకటపాలెం టీటీడీ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటామంటూ చంద్రబాబు, రాజధాని రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు, కులవాదులు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో బాబు ఆయన అనుయాయుల మనసు మార్చాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బహుజన పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. పలువురు బహుజన పరిరక్షణ సమితి నాయకులు  పాల్గొన్నారు.  

నాడు పెత్తందారుల పసుపు నీళ్లు.నేడు పేదల క్షీరాభిషేకం 
అమరావతి ప్రాంతంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తే నాడు ‘పచ్చ’ పెత్తందారులు పసుపు నీళ్లు చల్లి కుట్రలకు తెరదీస్తే.. నేడు అదే ప్రాంతంలో పేదలు  జగనన్నకు క్షీరాభిషేకం చేసి అభిమానం చాటుకుంటున్నారు.

అమరావతిలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో  అమరావతి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గురువారం ఆ ప్రాంతంలో పేదలతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు శృంగారపాటి సందీప్, పలువురు 11 గ్రామాల్లోని 25 లే అవుట్‌లలో 2000 లీటర్ల పాలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, దిగంవత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటాలకు, ప్లాట్లకు  క్షీరాభిషేకం చేశారు.  
 
తాడేపల్లి ప్రాంతంలో.. 
కొండపోరంబోకులోనూ, రైల్వే స్థలాల్లోనూ బిక్కుబిక్కుమంటూ 40–50 సంవత్సరాల నుంచి  నివాసముంటున్న పేదలకు సొంతింటి కల నెరవేరడంతో ఆనందంతో  తాడేపల్లి పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముదిగొండ ప్రకాష్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇత్తడి పండు, ఎం. మార్తమ్మ, జమ్మలముడి సునీత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు