Fact Check: అడ్డగోలు అప్పులు దాచేసి ముష్టి లెక్కలు!

8 Mar, 2024 04:38 IST|Sakshi

అమరావతి బాండ్లంటూ చంద్రబాబు అలవోకగా చేసిన అప్పు రూ.5,000 కోట్లు

ఆ బాబు చేసిన అప్పు రూ.ఐదు వేల కోట్లయితే వడ్డీలకే రూ.4,900 కోట్లు కట్టాలి

ఇప్పటిదాకా కట్టిన వడ్డీలు రూ.1,400 కోట్లు.. తప్పనిసరి గుదిబండపై ‘కాగ్‌’ ఆందోళన

ఇప్పుడు పరిమితంగానే అప్పులు.. మానవ వనరులపై పెట్టుబడికి ప్రాధాన్యం

విద్య, వైద్యం, పారిశ్రామిక పురోగతిపై నిధులను వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

నాడు–నేడు అప్పుల గణాంకాలతో అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రజెంటేషన్‌

ఏపీ అప్పులు అట్టడుగునే ఉన్నాయని పలు దఫాలు ప్రకటించిన కేంద్రం, ఆర్బీఐ

రామోజీ సొంత లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వంపై పదేపదే దుష్ప్రచారం

కేంద్రం, ఆర్బీఐ, కాగ్‌ గణాంకాలు, వివరణలు తనకు పట్టవంటూ లెక్కలేనితనం  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అప్పులకు సంబంధించి స్వయంగా కేంద్రం ప్రభుత్వం లెక్కలేనన్ని సార్లు కీలక ప్రకటనలు చేసింది. పార్లమెంట్‌ సాక్షిగా వివరణలూ ఇచ్చింది. అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ అట్టడుగునే ఉందనీ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్‌ అప్పులున్నట్లు తేల్చి చెప్పింది. రాష్ట్ర అప్పులపై ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌ కూడా చాలా వివరంగా చెప్పారు. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల – వైఎస్సార్‌­సీపీ పాలనలో అప్పుల గురించి ప్రజెంటేషన్‌ ద్వారా స్పష్టంగా తెలియచేశారు.

ఏపీ రుణాల గురించి నేరుగా కేంద్రం, ఆర్బీఐ చెబుతున్నా తలకెక్కదా? చట్టసభల్లో ప్రభుత్వాలు వెల్లడించిన గణాంకాలను కాదని తనకు తోచిన లెక్కలతో రామోజీ తప్పుడు రాతలు ఎలా రాస్తారు? రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో డప్పు కొట్టే గురివిందను ఏమనుకోవాలి? అసలు ఏ ప్రభుత్వాలకైనా తీసుకునే అప్పులను రహస్యంగా ఉంచడం సాధ్యం కాదనే ఇంగితం లేదా? పరిమితికి లోబడి తీసుకునే అప్పులను గ్రాఫిక్స్‌ ఆర్భాటాల కోసం కాకుండా వనరులను సృష్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది.

మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మా­ర్పు­లు తీసుకొచ్చి చదువులను చక్కదిద్దేందుకు వైఎస్సార్‌ సీపీ ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.73 వేల కోట్లకు పైచిలుకే! మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం పెత్తందారుల దృష్టిలో వృథానేనా? ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, పెద్ద ఎత్తున సదుపాయాల కల్పన అనవసర­మా? సుదూర తీర ప్రాంతాన్ని సద్వినియో­గం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రం ఎదిగేందుకు ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటు చేయడం వృథానా?

రాజధాని గుదిబండ రూ.5 వేల కోట్లు!
అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు భవిష్యత్‌లో తప్పనిసరి ఆర్థిక బాధ్యతలుగా పరిణమించాయని కాగ్‌ స్పష్టం చేసింది. అమరావతి బాండ్ల పేరుతో గత సర్కారు ఏకంగా 10 సంవత్సరాల కాలానికి అత్యధిక వడ్డీతో అప్పు చేసినట్లు పేర్కొంది. మార్కెట్‌ రుణాల ద్వారా రూ.5,013.60 కోట్లు సమీకరించగా వడ్డీలకే ఏకంగా రూ.4,827.14 కోట్లు చెల్లించాల్సి ఉందని కాగ్‌ నివేదిక వెల్లడించింది.

ఇప్పటికే 1,399.02 కోట్లు వడ్డీల కింద చెల్లించగా భవిష్యత్‌లో మరో రూ.3,428.12 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచ స్థాయి రాజధాని నిజం కాలేదు గానీ తప్పనిసరి ఆర్ధిక బాధ్యతలు మాత్రం మోయాల్సి వస్తోందని కాగ్‌ వ్యాఖ్యానించింది. 2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ సర్కారు పేలవమైన ఆర్థిక నిబద్ధత చూపిందని తప్పుబట్టింది. 

ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో 2022–23కి సంబంధించి కాగ్‌ అకౌంట్స్‌ సమర్పించింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, జీఎస్‌డీపీలో అప్పులు ఉన్నాయని అందులో స్పష్టం చేసింది. సొంత లెక్కలు కాకుండా కాగ్‌ అకౌంట్స్‌ను పరిశీలిస్తే రామోజీకి ఆ విషయాలు తెలుస్తాయి. 

అప్పుల కోసం సచివాలయం, ఇంకా కనిపించినవన్నీ తాకట్టు పెడుతున్నారంటూ రామోజీ పచ్చి అవాస్తవాలను కుమ్మరించారు. వాస్తవానికి రాజధాని అంటూ అమరావతి భూములను తాకట్టు పెట్టి బాండ్లు పేరుతో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసింది చంద్రబాబు సర్కారే. కాగ్‌ నివేదికే ఆ విషయాన్ని ఎండ­గట్టింది. గ్రాఫిక్స్‌ బండారాన్ని బయట పెట్టింది. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు అప్పుల నిర్వాకంతో ఇప్పుడు వడ్డీల చెల్లింపులు భారంగా మా­రాయి. అత్యధిక వడ్డీలకు అప్పు­లు చేయడంతో అప్పు తెచ్చిన పరిమాణానికి దాదాపు సమానంగా వడ్డీ కూడా ఉండ­టాన్ని కాగ్‌ నివేదిక తప్పుబట్టింది. 

 నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల­లను బాగు చేసేందుకు రూ.16 వేల కోట్లు వెచ్చించి ఉత్తమ మానవ వనరుల ద్వారా ఆస్తుల కల్పన చేయటాన్ని చూసి రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ప్రభు­త్వ వైద్య రంగంలో ఏకంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలను రూ.16 వేల కోట్లతో నిర్మిస్తుంటే మంచం పట్టారు! రూ.­24,000 కోట్లతో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణమూ ఆయనకు మింగుడు పడటం లేదు! ఎందుకంటే తాను ద్వేషించే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే అనుకోవాలేమో!

 గత ఎన్నికల ముందు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి, గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్‌ నుంచి అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ పేరు­తో ఓటర్లను మభ్యపుచ్చేందుకు ప్రయత్ని­స్తే రామోజీ కిక్కురుమనలేదెందుకో?

 రాష్ట్ర అప్పులు బడ్జెట్‌ లోపల, బయట కలిపి ఏకంగా రూ.10.21 లక్షల కోట్లకు చేరాయంటూ పచ్చి అబద్ధాలను రామోజీ తన కరపత్రంలో గుమ్మరించారు. 2022–23 నాటికి కాగ్‌ అసెంబ్లీకి సమర్పించిన అకౌంట్స్‌ ప్రకారం బడ్టెట్‌ లోపల, బడ్జెట్‌ బయట రాష్ట్రం అప్పులు రూ.5.68 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. బడ్జెట్‌ లోపల అప్పులు రూ.4,29,526 కోట్లు కాగా బడ్జెట్‌ బయట అప్పులు రూ.1,38,875 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట చేసిన అప్పులను శాసనసభకు సమర్పించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ పత్రం ద్వారా అందచేస్తూ ఎక్కడా దాపరికం లేకుండా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహ­రిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎ నిబంధనల కన్నా తక్కువగానే అప్పులున్నట్లు 2022–23 కాగ్‌ అకౌంట్స్‌ స్పష్టం చేశాయి.

Election 2024

మరిన్ని వార్తలు