Jupudi Prabhakar Rao: టీడీపీకి గుండు సున్నానే..

20 Sep, 2021 09:27 IST|Sakshi

రాజకీయాధికారం అందని వర్గాలకు సీఎం వల్లే ఈ రోజు పదవులు

ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు 

సాక్షి, అమరావతి: టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా దక్కే ఫలితం గుండు సున్నానే అని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ గత రెండున్నరేళ్లుగా సామాజిక విప్లవ పంథాను అనుసరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకరరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ రోజూ రాజకీయాధికారం దక్కని వర్గాలకు ఇప్పుడు దాన్ని అందించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితమైన పదవులను బడుగు, బలహీనవర్గాలకు కూడా వందల్లో, వేలల్లో అందించారని కొనియాడారు.

భారత రాజ్యాంగానికి ప్రతిరూపంగా సామాజిక న్యాయం ఏపీలోనే అమలవుతోందని సామాజిక న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సైతం కొనియాడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎంకు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకుని ముందుగానే కాడి పారేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకున్న బడుగు, బలహీన వర్గాలన్నీ సీఎం జగన్‌కి అండగా నిలుస్తున్నారని తెలిపారు.

టీడీపీతో ఉన్న వర్గాలేవో చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీలపై చంద్రబాబు వాడిన భాషను ఎప్పటికీ ఈ వర్గాలు మరిచిపోవన్నారు. దళిత మహిళా హోం మంత్రి సుచరితపై టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అలాంటి మాటలను నియంత్రించకుండా నవ్వుతూ కూర్చున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ఏమనాలి అని ప్రశ్నించారు.

చదవండి: AP MPTC, ZPTC elections results: వారెవా.. వలంటీర్‌!

మరిన్ని వార్తలు