లోకేశ్‌ హైడ్రామా 

10 Sep, 2023 05:42 IST|Sakshi
రాజోలు మండలం పొదలాడ శుభం గ్రాండ్‌ హోటల్‌ ఎదుట బైఠాయించిన లోకేశ్‌

తన తండ్రి చంద్రబాబును చూడటానికి విజయవాడ వెళ్తానని పట్టు 

రాజోలు మండలం పొదలాడలో రోడ్డుపై బైఠాయింపు 

సాక్షి అమలాపురం/రాజోలు: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడంతో ఆయన కుమారుడు నారా లోకేశ్‌ బస చేసిన హోటల్‌ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు లోకేశ్‌ను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తన తండ్రిని చూసేందుకు విజయవాడ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ తాను బస చేసిన హోటల్‌ బయట రోడ్డుపై బైఠాయించి లోకేశ్‌ నిరసన తెలిపారు.

ప్రస్తుతం ఆయన పాదయాత్ర బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో సాగుతోంది. శుక్రవారం రాత్రి లోకేశ్‌ పాదయాత్ర ముగించుకుని పొదలాడలోని శుభం గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. తన తండ్రి చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి విజయవాడ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడు విజయవాడ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని చెప్పడంతో వారిపై లోకేశ్‌ విరుచుకుపడ్డారు.

రాజోలు సీఐ గోవిందరాజుతో వాగ్వాదానికి దిగారు. అలాగే కొత్తపేట డీఎస్పీ కేవీ రమణతో సైతం గొడవపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దాక బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు వారిస్తున్నా లోకేశ్‌ వినిపించుకోలేదు. తీవ్ర పదజాలంతో పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘మీకు సిగ్గులేదా? నన్ను అడ్డుకోమన్న వాడు ఎవరు?’ అంటూ పరుష పదజాలంతో దూషణలకు దిగారు.

ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అక్కడే ఉన్నారు. పోలీసులు పలు సందర్భాల్లో నచ్చజెప్పినా లెక్క చేయలేదు. ‘తండ్రిని చూసేందుకు కొడుక్కి పోలీసు అనుమతి కావాలా’ అనే ప్లకార్డు, రాజ్యాంగ ప్రతులను చేతితో పట్టుకుని నిరసనకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో లోకేశ్‌ మధ్యాహ్నం విజయవాడ బయలుదేరి వెళ్లారు. నిరసన తెలుపుతున్న సమయంలో ముఖ్యమైన సన్నిహితులతో లోకేశ్‌ ఫోనులో మంతనాలు జరిపారు.
 

మరిన్ని వార్తలు