-

పేద మహిళలను లక్షాధికారులను చేశారు

25 Dec, 2020 18:18 IST|Sakshi

హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరిందని, లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు చూసి ఆనందంతో మురిసిపోతున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదవాడు ఎక్కడా ఒక సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ పేదలందరికీ గొప్ప అవకాశం ఇచ్చారని ప్రశంసించారు. తూర్పు గోదావరిలోని కొమరగిరిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. (చదవండి: 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ)

ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేవారని గుర్తు చేశారు. సీఎం జగన్‌ దాదాపు ముప్పై ఒక్క లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వారిని ఒకేసారి లక్షాధికారులను చేశారని ప్రశంసించారు. గత ప్రభుత్వం మాత్రం సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. (చదవండి: ఏమిటీ చిల్లర ఆరోపణలు?)

మరిన్ని వార్తలు