ప్రాజెక్టుల జాప్యానికి బాధ్యుడు చంద్రబాబే 

13 Aug, 2023 05:07 IST|Sakshi

14 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? 

బాబువి అవగాహన లేని అబద్ధపు మాటలు 

మంత్రి ధర్మాన ప్రసాదరావు  

శ్రీకాకుళం (పాత బస్టాండ్‌): రాష్ట్రంలో ప్రాజెక్టుల జాప్యానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబునాయుడే నని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సాగునీరు, వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం నాలుగేళ్ల పాలన చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు కనీస అవగాహనతో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు.

అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయిందని.. అందులో రెండేళ్లు కరోనా కష్టకాలంలోనే గడిచిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికే వంశధార ప్రాజెక్టు 77 శాతం పూర్తయిందని, డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కేవలం 23 శాతం మాత్రమే చేశారన్నారు. నేరడి బ్యారేజీ సమస్యపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించామని.. ఇలాంటి ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ధర్మాన ప్రశ్నించారు. రూ.200 కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును తయారు చేసి సాగునీరు అందించడం జరుగుతోందని తెలిపారు.

చంద్రబాబు నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తే, ఇటీవల వారికి రూ.200 కోట్లు మంజూరు చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న చంద్రబాబునాయుడు 14 ఏళ్లు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ‘విధ్వంసం’ అనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ‘నీరు–చెట్టు’ పేరుతో నాయకులు దోపిడీ చేశారన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు వ్యవసాయ రంగంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్‌మెంట్‌ దండగ అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు.  

మరిన్ని వార్తలు