బాబుపై భగ్గుమన్న ముస్లింలు 

2 Dec, 2020 09:11 IST|Sakshi
కదిరిలో రోడ్డుపై బైఠాయించిన ముస్లిం మైనార్టీలు 

చట్టసభలో మైనార్టీ ఎమ్మెల్యేపై దూషణలా..? 

చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే 

నిరసన కార్యక్రమంలో ముస్లింల డిమాండ్‌ 

సాక్షి, కదిరి/హిందూపురం: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వయసు, హోదా, అనుభవాన్ని మరచి అసెంబ్లీలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను అసభ్య పదజాలంతో దూషించడంపై ముస్లిం మైనార్టీలు భగ్గుమన్నారు. రాజకీయాల్లో తానొక అపరమేధావినంటూ గొప్పలు చెప్పుకునే నేత చేసిన ఈ వ్యాఖ్యలు అందరూ అసహ్యించుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. ముస్లింలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కదిరిలోని అంబేడ్కర్‌ కూడలిలో రాస్తారోకో చేశారు. అధికారం కోల్పోయాక చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

ముందు నుంచీ ముస్లింలపై చిన్నచూపే 
చంద్రబాబుకు ముందు నుంచీ ముస్లిం మైనార్టీలంటే చిన్నచూపని నాయకులు మండిపడ్డారు. తన మంత్రివర్గంలో నాలుగున్నరేళ్లు ముస్లింలకు స్థానం కల్పించకుండా, చివర్లో కొన్ని నెలలు ముస్లింలకు చోటిచ్చాడని గుర్తు చేశారు. గెలవగలిగే అసెంబ్లీ స్థానాలను ఏనాడూ ముస్లింలకు కేటాయించలేదన్నారు. హఫీజ్‌ఖాన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పకపోతే స్థానిక ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తామని హెచ్చరించారు.   చదవండి:  (ఏమనాలి వీణ్ణి .. ఇంగిత జ్ఞానం ఉందా?)

వైఎస్‌ కుటుంబానికి రుణపడి ఉన్నాం 
ముస్లిం మైనార్టీలకు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించారని, ఆ కుటుంబానికి ముస్లింలు ఎప్పుడూ రుణపడి ఉంటారని వారు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ముస్లింల పక్షపాతిగా ఉన్నారని, ముస్లింలకు టికెట్‌ ఇవ్వడమే కాకుండా వారందరినీ గెలిపించుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బాహవుద్దీన్, మైనార్టీ నాయకులు వేముల ఫయాజ్, జిలాన్, ఖలీల్, అన్సర్, నౌషాద్, ఫారూక్, ఎహసాన్, వలి, సాదిక్, అమీర్, ఖలందర్, నాసీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి 
చట్టసభలో మైనార్టీ ఎమ్మెల్యేపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని హిందూపురం ముస్లిం మైనార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. మైనార్టీ నాయకులు మాజీ ముతవల్లి కలీం, ఇర్షాద్‌ అహ్మద్, ఇందాద్, కట్ల బాషా మాట్లాడుతూ చంద్రబాబుకు మైనార్టీ, ఎస్సీ, బీసీ కులాలంటే గిట్టదని, ఇప్పటికే పలుమార్లు ఆయా సామాజిక వర్గాల వారిని దూషించడం, బెదిరించడం చేశారన్నారు. తన సొంత సామాజికవర్గం తప్ప మిగిలిన కులాల గురించి ఆయనకు పట్టదన్నారు. మైనార్టీలు తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమున్న 23 సీట్లు కాస్తా నాలుగుకు పడిపోయేలా చేస్తామన్నారు.  

మీలా వెన్నుపోటు రాజకీయాలు తెలియవు బాబూ.. 
నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మీలా వెన్నుపోటు రాజకీయాలు చేయడం మైనార్టీలకు తెలియదని, తమకు మంచి చేసిన వారిపట్ల కృతజ్ఞతాభావంతో ఉండటమే తెలుసని అన్నారు. గత ఎన్నికలప్పుడు ‘బాబు హమారా’ అనే సభలోనే బాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. మైనార్టీ యువకులపై పోలీసులతో దాడులు చేయించి, దేశద్రోహం కేసులు పెట్టించిన విషయాన్ని తాము మరువలేదన్నారు. ముస్లింలు ఓటు వేయకుండానే హిందూపురంలో టీడీపీ వారు గెలిచారా అంటూ ప్రశ్నించారు.  

అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద బైఠాయింపు 
ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌  చేస్తూ హిందూపురంలోని ముస్లింలు చంద్రబాబు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ఉపక్రమిస్తుండగా సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ కరీం తమ సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు.  దీంతో ముస్లిం నాయకులు అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ ముస్లిం నాయకులు సీపీసీ సాదిక్, ఆసీఫుల్లా, జబీవుల్లా, రోషన్‌అలి, మస్తాన్, సలీముల్లా, ఇలియాజ్, షఫీ, రహమత్, బాబు, అల్తాఫ్, నజీర్, అబ్దుల్లా, షాజహాన్, రియాజ్, ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు